సీబీఐ డైరెక్టర్‌కు ఎంపీ రఘురామ లేఖ..

by  |
raghu ram raju
X

దిశ, ఏపీ బ్యూరో: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. వైఎస్ జగన్‌ తరపు న్యాయవాది పి.సుభాష్‌ను సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా నియమించడంపై లేఖలో అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులను సుభాష్ వాదిస్తున్నారని గుర్తు చేశారు. ఢిల్లీలో శనివారం మీడియాతో మాట్లాడిన ఎంపీ రఘురామ… వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, డాక్టర్ సుధాకర్, జడ్జిలపై అభ్యంతకర పోస్టులు పెట్టిన కేసుల్లో సీబీఐ విచారణ జరుపుతోందని గుర్తు చేశారు. ఇలాంటి తరుణంలో జగన్ తరపు న్యాయవాది సుభాష్‌ను సీబీఐ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా నియమించడం సీబీఐపై విశ్వాసాన్ని సన్నగిల్లెలా చేస్తోందని రఘురామ వ్యాఖ్యానించారు. అవసరమైతే కేంద్రానికి, పీఎంవోకు, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, ఏపీ హైకోర్టు సీజేకు కూడా లేఖలు రాస్తానని తెలిపారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు, డాక్టర్ సుధాకర్, జడ్జిలపై అభ్యంతకర పోస్టుల కేసు విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే సుభాష్‌ని తొలగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. సీబీఐ, ఈడీ అధికారులతో విజయసాయి నిరంతరం మంతనాలు చేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ లాయర్‌గా సుభాష్ నియామకం వెనుక విజయసాయి పాత్ర ఉందని లేఖలో ఆరోపించారు. సీబీఐ, ఈడీ కేసుల్లో అనుకూల అధికారుల నియామకం జరిగేలా విజయసాయి చూస్తున్నారని రఘురామ ఆరోపించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం ఏపీలో తప్పుడు కేసులు పెట్టి ఇతర పార్టీలను వేధిస్తోందని ఆరోపించారు. పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఒంటిమీద చేయి వేయకూడదని ఎంపీ రఘురామ సూచించారు.

Next Story

Most Viewed