వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ నామా

110

దిశ ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణ రైతాంగ సమస్యపై ఐదో రోజూ పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు. వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని లోక్ సభ ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ లోక్ సభా పక్షనేత నామా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తాము ఐదు రోజుల నుంచి రాష్ట్ర రైతాంగ జీవన్మరణ సమస్యపై పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వం, కేంద్రమంత్రులు కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు జరుగుతున్న సమయంలో తాము డిమాండ్ చేస్తున్నా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

తెలంగాణలో వరి ధాన్యం సేకరణపై కేంద్రమంత్రి, తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు ఒక్కో విధంగా మాట్లాడుతూ రాష్ట్ర రైతాంగాన్ని గందరగోళానికి గురి చేస్తున్నారని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా దృష్టికి నామా నాగేశ్వరరావు తీసుకొచ్చారు. కేంద్రం ఈ విషయంలో ప్రకటన చేస్తే అసలైన సమాచారం తెలుస్తుందని విజ్ఞాపన చేశారు. ఈ క్రమంలో తెలంగాణ డిమాండ్లను పట్టించుకోకుండా రాష్ట్ర బీజేపీ ఎంపీలు నామా ప్రసంగానికి అడ్డుతగిలే ప్రయత్నం చేశారు.