రైల్వే జీఎం‌ను కలిసిన బండి సంజయ్.. కీలక చర్చలు

by  |
రైల్వే జీఎం‌ను కలిసిన బండి సంజయ్.. కీలక చర్చలు
X

దిశ, కరీంనగర్ సిటీ: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న పలు రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం పెంచాలని ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. గురువారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు. వాహనదారుల ట్రాఫిక్ సమస్యలు నివారణ నేపథ్యంలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎల్‌సీ గేట్ నెం. 18 వద్ద ఆర్ఓబీ మంజూరైందని, ట్రాఫిక్ రద్దీ దృష్టిలో ఉంచుకొని ఇటీవల మంజూరైన ఈ ఆర్ఓబీకి టెండర్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు.

కరీంనగర్-నిజామాబాద్ సెక్షన్‌లో రైళ్ల రద్దీ పెరిగిన నేపథ్యంలో గంగాధర వద్ద ఎల్‌సీ గేట్ నెం.29 గుండా నిత్యం లక్షలాది వాహనాలు వెళ్తున్నాయని, వాహనదారులకు ట్రాఫిక్ చిక్కుల నుంచి విముక్తి కల్పించేందుకు ఆర్ఓబీ అత్యవసరమని, దీనిని ప్రత్యేక కేసుగా పరిగణించి గంగాధర వద్ద ఆర్ఓబీ మంజూరు చేయాలని కోరారు. ఉప్పల్-కమలాపూర్ మధ్యనున్న లెవల్ క్రాసింగ్ వద్ద మంజూరైన ఆర్ఓబీ నిర్మాణ పనులను నిదానంగా సాగుతున్నాయని, కరీంనగర్ సెక్షన్‌లో గూడ్స్, ప్యాసింజర్ రైళ్లు పెరగడంతో ఉప్పల్-కమలాపూర్ మధ్యనున్న లెవల్ క్రాసింగ్ వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలోనే ఆర్ఓబీ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఎస్‌సీఆర్ జనరల్ మేనేజర్‌ను కోరారు. కరీంనగర్-ఖాజీపేట బైపాస్ రైల్వే లైన్ నిర్మాణం దిశగా సత్వర చర్యలు చేపట్టాలన్నారు. సికింద్రాబాద్ డివిజన్‌లో కీలకమైన ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలన్నారు. కరీంనగర్, జమ్మికుంట, బిజిగిరిషరీఫ్, ఉప్పల్ రైల్వే స్టేషన్లలో సుందరీకరణ పనులు చేపట్టాలన్నారు. హుజూరాబాద్ మీదుగా కరీంనగర్-హసనపర్తి రైల్వే లైన్ సర్వే పూర్తై చాలా కాలమైందని, వచ్చే బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టును చేర్చేలా వ్యక్తిగత శ్రద్ధ చూపాలని కోరారు. ప్రజల సౌకర్యార్థం, వాహనదారుల ఇబ్బందులు నివారించేందుకు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో రైల్వే చీఫ్ ఇంజనీర్ విశ్వనాథ్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.


Next Story

Most Viewed