భవిష్యత్‌లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగేది ఇదే : బండి సంజయ్

by  |
భవిష్యత్‌లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య జరిగేది ఇదే : బండి సంజయ్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బీజేపీపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను మానుకోవాలని.. ఎన్నటికీ టీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీచేసే ప్రసక్తే లేదని బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పష్టం చేశారు. రెండు పార్టీల మధ్య జరిగేది యుద్ధమే అని తేల్చిచెప్పారు. ఆదివారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర నాల్గవ రోజూ కొనసాగింది. లింగంపేట్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడిన నాయకులపై నిందలు వేసి బయటకు పంపిచేస్తున్నావని, ఉద్యమ ద్రోహులను కాపాడుతున్న ద్రోహివి అని అన్నారు. కేసీఆర్ త్రిపుల్ తలాక్‌ను సమర్దిస్తున్నవా.. వ్యతిరేకిస్తున్నవా..? సమాధానం చెప్పాలని కోరారు. హిందువుల పండుగలకు ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలా.. అదే వేరేవారి పండుగలకు ఎలాంటి పర్మిషన్ అవసరం లేదా..? ఇదా నీ పాలన అని దుయ్యబట్టారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లో కోటి రూపాయలు ఎలా సంపాదిస్తున్నావ్, గంజాయి పండిస్తున్నవా లేక గుడుంబా తయారు చేస్తున్నావా అని ప్రశ్నించారు. కోటి రూపాయాల సంపాదన కిటుకు ఎంటో రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతులు కూడా నీలాగా కోటీశ్వరులు అవుతారని వివరించారు.

ఉపఎన్నికలు వస్తేనే పాసు బుక్కులు..

ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలంలోని పేదవాళ్లకు పాత తోక పాసు పుస్తకాలకు కొత్త పాస్ బుక్కులు రావాలంటే ఇక్కడ ఉపఎన్నికలు రావాలని బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే అని అందుకు లింగంపేట్ పేదవారికి ఇప్పటికీ కొత్త పాస్ పుస్తకాలు రాకపోవడమే నిదర్శనం అని చెప్పారు. పోడు భూముల సమస్యలకు పరిష్కారం వెంటనే కేసీఆర్ చూపాలన్నారు. నేను చేసేది రాజకీయ యాత్ర కాదని ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఇది అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలకు పేర్లు కేసీఆర్ తనవిగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీ కలిసి ఎప్పుడూ పోటీ చేయలేదు.

టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు టీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేశాయని గుర్తు చేశారు.పేదలకు న్యాయం జరగాలంటే బీజేపీ రాష్ర్టంలో 2023లో అధికారంలోకి రావాలన్నారు. ముఖ్యమంత్రి కుటుంబం కోసమా..? మన యువకులు బలిదానాలు చేసింది, కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలంటే బలిదానం చేసిన యువకుల కుటుంబాల గురించి ప్రజలు ఆలోచించాలన్నారు.

నాల్గవ రోజుకు చేరిన మహాసంగ్రామ పాదయాత్ర..

బండి సంజయ్ వెంట నియోజకవర్గ ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షులు బానాల లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు. ఆదివారం ఉదయం ముంగర శెట్టిపల్లి క్రాస్‌రోడ్ నుంచి ప్రారంభమైన ప్రజా సంగ్రామ యాత్ర ముంగర శెట్టిపల్లి క్రాస్ రోడ్డు వద్ద రాత్రి బసచేసిన శిబిరంలో కార్యకర్తల రక్తదాన శిబిరాన్ని బండి సంజయ్ ప్రారంభించారు. లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఆరోగ్య కార్యకర్తలు ఉద్యోగులతో మాట్లాడిన బండి సంజయ్.. వ్యాక్సినేషన్ ఎలా జరుగుతుందని వాకబు చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో సంజయ్‌ పాదయాత్రకు దారిపొడవునా ఘన స్వాగతం పలికారు. లింగంపేట్‌లో కాయితీ లంబాడా మహిళలు ప్రత్యేక నృత్యం చేస్తూ పాదయాత్ర ముందు నడిచారు. ఆ తర్వాత లింగంపేట్ మండలంలో బహింగ సభ జరిగింది.

Next Story

Most Viewed