కవిత కాళ్లు మొక్కే బదులు మంత్రి పదవికి రాజీనామా చెయ్: ఎంపీ అర్వింద్

by  |
Aravindh-MP-1
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణలో ప్రజలకు ఏమైనా చేస్తున్నారా అని అడిగితే పెన్షన్లు ఇస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అంటాడు.. అయన మరి రైతులకు ఏమైనా చెయ్యమంటే కేంద్రం చేస్తాలేదు అంటాడు కానీ… కుండలు పెట్టి.. బిందెలు నొక్కుడులో జిల్లా మంత్రి వేములకి గోల్డ్ మెడల్ ఇవ్వొచ్చు అని ఎంపీ అర్వింద్ అన్నారు. శనివారం సాయంత్రం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రలు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డిల ఉద్దేశించి తీవ్రమైన వాఖ్యలు చేశారు. మంత్రికి ఓట్లు వెయ్యడం ప్రజల ఖర్మ అని అన్నారు. తనను గెలిపించిన బాల్కోండ ప్రజలను మరిచి ఎమ్మెల్సీ కవితను ప్రసన్నం చేసుకోవాడానికి అమె చుట్టూ తిరుగుతున్నాడు అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కాళ్లు మొక్కే బదులు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ చుట్టూ తిరుగడానికి గంట సమయం పడుతుందని, అందుకు కారణం మంత్రి ప్రశాంత్ రెడ్డేనని, కేంద్రం రైల్వే ద్వారా నిధులు ఇచ్చినా మాదవనగర్ ఆర్ఓబీ పనులను ఎందుకు ప్రారంభించలేదో ప్రజలకు చెప్పాలన్నారు.

కేసీఆర్ ను బాపుగా పిలుచుకునే ప్రశాంత్ రెడ్డి దళితబంధును అమలు చేయాలని అడిగేందుకు భయపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో 300 శాతం ఎక్కువగా బియ్యాన్ని ఎఫ్ సీఐ సేకరించిందన్నారు. 70 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కేంద్రం పెట్టుమన్న చోట ఎలా సంతకం పెట్టాడని.. అవన్నీ ఝాటా మాటలన్నారు. గతంలో పంటల మార్పిడి అని రైతులను ఆగం చేసి మొక్కజొన్న వేయద్దని, ఇప్పుడు వరి వేయద్దని ఏ పంటలు వేయాలో ఆయనే చెప్పడం లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు రూ.300 బోనస్ ఇస్తున్నారని కేసీఆర్ ఎందుకు ఇవ్వడో ప్రశ్నించాలన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో రైతులను చెరుకు పండించాలని చెప్పే ముఖ్యమంత్రి నిజాంషుగర్ ను తెరువడానికి ఏ రోగం వచ్చి తెరవడం లేదన్నారు. మార్కెట్ లో ఇథనాల్ కు మంచి డిమాండ్ ఉందని, చక్కెర ఫ్యాక్టరీ నడిస్తే ఆయిల్ కంపెనీలు వచ్చి కొనుగోలు చేస్తారని, ఇప్పటికీ విదేశాల నుంచి దిగుమతి జరుగుతుందన్నారు. రైస్ మిల్లర్లకు ధాన్యం కేటాయించి రాష్ట్రం పెద్ద ఎత్తున ఇరుక్కపోయిందని.. అందుకే రీ-సైక్లింగ్ దందా చేస్తుందన్నారు. అందులో కేటీఆర్, ఆయన సహచరులకు ప్రమేయం లేకపోతే రైతులను మిల్లర్లు దోస్తున్నా.. తరుగుపేరుతో దగా చేస్తున్నా ఎందుకు కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యేలు సందర్శించడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీగా ఎన్నికై కవిత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తుందా అని సంశయం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ, పల్లె గంగారెడ్డి, నగర అధ్యక్షుడు పంచరెడ్డి లింగం, కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్, రోషన్, జలేంధర్ యాదవ్ తదితరులున్నారు.

Next Story

Most Viewed