ఇది నాకు సెంటిమెంట్ థియేటర్: Nandamuri BalaKrishna

by Disha Web Desk 2 |
ఇది నాకు సెంటిమెంట్ థియేటర్: Nandamuri BalaKrishna
X

దిశ, డైనమిక్ బ్యూరో: సీనియర్ ఎన్టీఆర్(నందమూరి తారక రామారావు) శత జయంతి సందర్భంగా తారకరామ థియేటర్ రీఓపెన్ చేయడం సంతోషంగా ఉందని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. తారకరామ థియేటర్ పెద్దాయన (సీనియర్ ఎన్టీఆర్) జ్ఞాపకమని తెలిపారు. హైదరాబాద్‌లోని కాచిగూడ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న నందమూరి కుటుంబానికి చెందిన తారకరామ థియేటర్ ఆధునిక టెక్నాలజీతో సరికొత్తగా పునర్నిర్మితమవగా.. ఈ థియేటర్‌ను నేడు బాలకృష్ణ ప్రారంభించారు. ఏషియన్ సంస్థ ఈ థియేటర్‌ను తీసుకుని మరమ్మతులు చేసింది. దీంతో, తారకరామ థియేటర్ ఇప్పుడు ఏషియన్ తారకరామగా మారింది. థియేటర్‌ను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడిన బాలకృష్ణ.. సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని.. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ ఎన్నో మార్పులు తెచ్చారన్నారు. అమ్మ, నాన్నల పేర్లు కలిసి వచ్చేటట్లు ఈ థియేటర్‌కు పేరు పెట్టారని తెలిపారు. ఈ థియేటర్‌లోనే తన అబ్బాయికి మోక్షజ్ఞ అని పేరు పెట్టామని అన్నారు.

ఇక్కడికి వస్తే పాత రోజులు గుర్తొస్తాయని తెలిపారు. ఈ థియేటర్‌లో అందరికీ అందుబాటు ధరల్లోనే టికెట్స్ ఉంటాయన్నారు. ప్రేక్షకులు థియేటర్‌లలో సినిమా చూడ్డానికి ఎక్కువగా ఇష్టపడతారని బాలయ్య చెప్పారు. 1978లో దీన్ని ప్రారంభించామని... 'సలీం అనార్కలి' సినిమాతో ఇది మొదలయిందని చెప్పారు. కొన్ని కారణాల వల్ల గతంలో థియేటర్ మూతపడిందని, 1995లో పునఃప్రారంభించామని బాలయ్య చెప్పారు. ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీ, హంగులతో మూడోసారి అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఈ థియేటర్ తనకు వ్యక్తిగతంగా సెంటిమెంట్ అని, తన సినిమాలు ఇక్కడ ఘన విజయాలను అందుకున్నాయని చెప్పారు. డాన్ మూవీ 525 రోజులు ఈ థియేటర్‌లో ఆడిందని బాలయ్య గుర్తు చేసుకున్నారు. కాగా, 590 సీట్ల సామర్థ్యంతో 4K ప్రొజెక్షన్‌తో థియేటర్‌ను రీఓపెన్ చేశారు. ఈ నెల 16 నుంచి అవతార్ 2 చిత్రంతో ఏషియన్ తారకరామ థియేటర్‌లో షోస్ ప్రారంభం కానున్నాయి.

ఇవి కూడా చదవండి :...

అభిమానులకు Megastar Chiranjeevi Surprise




Next Story

Most Viewed