కేరళలో కేసులకు అవే కారణమా ?

by  |
kerala
X

తిరువనంతపురం: కేరళలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. కొన్ని రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తున్నది. అక్కడి ప్రభుత్వం పండుగలకు కొన్నిరోజులపాటు సడలింపులు ఇస్తుండటంతోనే కేసుల సంఖ్య పెరుగుతున్నదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బక్రీద్ వేడుకలకు ఆంక్షల సడలింపునివ్వడంతో గత నెల 27 నుంచి రోజువారీ కేసుల సంఖ్య 20వేలకు పైన, లేదా 20వేలకు దగ్గరగా నమోదవుతున్నది. ఓనం పండుగకు ఇచ్చిన ఆంక్షల సడలింపులు తోడవడంతో వీటి సంఖ్య మరింత పెరిగింది. దేశవ్యాప్తంగా రిపోర్ట్ అవుతున్న డైలీ కేసుల్లో దాదాపు సగం కేసులు కేరళ నుంచే వస్తుండటం అక్కడి ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నది. తాజాగా, బుధవారం ఒక్కరోజే ఏకంగా 31,445 మందికి పాజిటివ్‌గా తేలింది.

215 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 38,83,429కి పెరగగా, మృతుల సంఖ్య 19,972కు చేరింది. 1,70,292 యాక్టివ్ కేసులున్నాయి. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్యశాఖ వెల్లడించింది. క్రితం రోజు 24వేలకు పైగా కేసులు నమోదుకాగా, 24గంటల వ్యవధిలోనే కేసుల్లో 31శాతం పెరుగుదల కనిపించిందని తెలిపింది. అంతేకాకుండా, పాజిటివిటీ రేటు 19శాతం కన్నా ఎక్కువగా ఉందని వెల్లడిచింది. ఓనం ప్రభావంతో జనాభా పెద్ద ఎత్తున గుమిగూడారని, దీంతో మరో 10రోజుల వరకు కేసుల పెరుగుదల ఇలానే ఉండే అవకాశముందని రాష్ట్ర ఆరోగ్యమంత్రి వీణ జార్జ్ ఆందోళన వ్యక్తం చేశారు.

దేశంలో 37,593 కొత్త కేసులు
దేశవ్యాప్తంగానూ కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగానే ఉంది. మంగళవారం ఉదయం 8గంటల నుంచి బుధవారం ఉదయం 8గంటల వరకు భారత్‌లో 37,593 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇవి క్రితం రోజు రిపోర్ట్ అయిన కేసుల(25,467) కంటే 47.6శాతం అధికం. తాజా కేసుల్లో ఒక్క కేరళ నుంచే 24వేలకు పైగా రిపోర్ట్ కావడం గమనార్హం. ఇదే సమయంలో భారత్‌లో 648 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు రోజు మృతుల సంఖ్య 354. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,25,12,366కు చేరగా, మృతుల సంఖ్య 4,35,758కి పెరిగింది. యాక్టివ్ కేసులు 3,22,327కు చేరయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది.

Next Story

Most Viewed