కరోనా పోరులో అగ్రరాజ్యాలకు ఆదర్శం: మోడీ

by  |
కరోనా పోరులో అగ్రరాజ్యాలకు ఆదర్శం: మోడీ
X

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి భారత్‌కు చేరితే తీవ్ర పరిణామాలుంటాయని చాలా మంది భయపడ్డారు కానీ, దేశవాసులందరూ ఐకమత్యంగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటూ వారి భ్రమలను తొలగించారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. భారత్‌పై ప్రపంచ దేశాల దృక్పథం మారిందని, భారతీయులంతా ఐక్యంగా ఉంటే వారికి సాటే లేదని మరోసారి నిరూపించారని తెలిపారు. అగ్రరాజ్యాలు, సంపన్న దేశాలకూ ధీటుగా నిలుస్తుందని చాటిచెప్పారని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. ఒక ఆడియో క్లిప్‌నూ విడుదల చేశారు. 2014 నుంచి 2019 వరకు భారత ప్రతిష్ట అసమానంగా పెరిగిందని, పేదల జీవితాలు మెరుగుపడ్డాయని వివరించారు. ఆర్థికంగానూ బలపడిందని, సర్జికల్ స్ట్రైక్‌లతో దేశ పటిష్టత వెల్లడైందని తెలిపారు. అలాగే, వన్ ర్యాంక్ వన్ పెన్షన్, వన్ నేషన్ వన్ ట్యాక్స్‌ కల సాకారం చేయడంతోపాటు రైతులకు కనీస మద్దతు ధరను పెంచామని వివరించారు. ప్రజలు సంతోషంగా చర్చించుకున్న నిర్ణయాలు ఆర్టికల్ 370 రద్దు, రామ మందిర నిర్మాణం, త్రిపుల్ తలాఖ్, పౌరసత్వ చట్ట సవరింపులను గతేడాది ధైర్యంగా తీసుకున్నామన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులందరూ లబ్ది పొందేలా నిర్ణయం తీసుకుంటున్నామని, ఒక్క ఏడాదిలోనే 9.5 కోట్ల మంది రైతులు లబ్ది పొందారని తెలిపారు. యువత, రైతులు, పేదలు, మహిళల సాధికారతకు కట్టుబడి ఉన్నామని వివరించారు. తమ ప్రభుత్వ నిర్ణయాలతో పట్టణ, గ్రామీణ అంతరాలు తగ్గిపోతున్నాయని, ఇప్పుడు ఇంటర్నెట్ గ్రామీణంలోనే ఎక్కువగా వాడుతున్నారని చెప్పారు. కరోనాతో ఏర్పడ్డ సంక్షోభాన్ని భారతీయులందరూ ఎదుర్కొనే కాలంలో ఉన్నామని తెలిపారు. అదే విధంగా ఇదే కాలంలో మనం స్వయంసమృద్ధిగా ఎదగాల్సిన అవసరమున్నదని అన్నారు. ఈ లక్ష్యానికి అనుగుణంగానే రూ. 20లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీని ప్రకటించినట్టు వివరించారు.



Next Story

Most Viewed