ఈ శతాబ్దంలోనే కీలక ఘట్టం: మోడీ

by  |
ఈ శతాబ్దంలోనే కీలక ఘట్టం: మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా భారత్‌ల మధ్య సంబంధాలు 21వ శతాబ్దంలోనే కీలక ఘట్టమని ప్రధాని మోడీ వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగాయి. అనంతరం నిర్వహించిన సంయుక్త సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. ట్రంప్ కుటుంబసమేతంగా భారత్ రావడం సంతోషంగా ఉందన్నారు. గత ఎనిమిది నెలల్లో ట్రంప్‌ను ఐదుసార్లు కలిశానని వెల్లడించారు. అలాగే, తమ మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశాల్లో మూడు కీలక ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో సహకారంపై చర్చించామనీ, ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు కలిసి పోరాడాలని నిర్ణయించామని వెల్లడించారు. భారత రక్షణ రంగానికి అత్యాధునిక ఆయుధాలు సమకూరనున్నాయని తెలిపారు. నాలుగు రంగాల్లో 70 బిలియన్ డాలర్ల (సుమారు రూ.50వేల కోట్లకు పైగా) ఒప్పందాలపై చర్చించినట్లు వివరించారు. ఇందులో చమురు సహకారం గురించి ప్రత్యేకంగా చర్చించామని వెల్లడించారు. వీటితో పాటు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారంపై ఇరువురి భావాలను పంచుకున్నట్టు తెలిపారు.
అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. భారత్‌లో తమకు అద్భుతమైన స్వాగతం లభించిందని తెలిపారు. ఈ పర్యటనను ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. మహాత్మా గాంధీ ఆశ్రమాన్ని, రాజ్‌ఘాట్‌ను, తాజ్‌మహాల్‌ను సందర్శించడం గొప్ప అనుభూతిని కలిగించిందని వెల్లడించారు. భారత్ గొప్ప మానవ సంబంధాలను కలిగివుందని ప్రశంసించారు. తన పర్యటన ఫలప్రదమైందనీ, మూడు బిలియన్ డాలర్లు(సుమారు రూ.2,155కోట్లకు పైగా) విలువైన రక్షణ ఒప్పందం కుదిరిందనీ, ఈ ఒప్పందంతో భారత రక్షణ రంగంలోకి అత్యాధునిక ఆయుధాలు చేరనున్నాయని వెల్లడించారు. ఇస్లాం తీవ్రవాదాన్ని అణిచివేస్తామన్నారు. తన పాలనలో భారత్‌తో ఆర్థిక సంబంధాలు మరింత మెరుగయ్యాయని చెప్పారు.



Next Story