యూపీ ఎన్నికల్లో ఎంఐఎంతో పోటీ చేయించడానికే మోడీ, కేసీఆర్ భేటీ

by  |
Rahul Gandhi
X

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ మధ్య విడదీయరాని బంధం ఉందని టీపీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్​రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీలు వేరైనా ఇద్దరి మధ్య విడదీయలేని బంధం ఉందని, ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ఎంఐఎం పార్టీతో ఎన్ని స్థానాలలో పోటీ చేయించాలనే విషయంపై కేసీఆర్, మోడీల మధ్య చర్చ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్, మోడీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధంలో బండి సంజయ్, ఈటల రాజేందర్ బలి పశువులు అవుతున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ బృందం బుధవారం భేటీ అయ్యింది. ఈ సందర్భంగా తెలంగాణ‌లో ప్రస్తుత రాజకీయ ప‌రిస్థితులు, కేసీఆర్ పాల‌న‌, బీజేపీ పాద‌యాత్ర అన్ని అంశాలపై చ‌ర్చించారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమించిన తర్వాత నూతన ఆఫీస్ బేరర్లతో రాహుల్ గాంధీ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. టీపీసీసీ నూతన కమిటీతో పాటుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం రేవంత్​రెడ్డి మీడియాతో మాట్లాడారు.

రానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విషయమై రాహుల్ గాంధీ పార్టీ నేతలతో చర్చించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సెప్టెంబ‌ర్ 17న సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గ‌జ్వేల్‌లో తలపెట్టిన ద‌ళిత, గిరిజ‌న దండోరా బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా రాహుల్‌ను కోరామని, అలాగే, ప్రతి మూడు నెలలకోసారి తెలంగాణలో పర్యటించాలని కోరామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సోనియా గాంధీ కొత్త రాష్ట్రాన్ని ఇచ్చారని, టీఎఆర్ఎస్ ఏడేళ్ల పాలనలో రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుందని మండిపడ్డారు. తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబమే పెద్ద సమస్య అని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయినట్లు కనబడుతున్నారని ఎద్దేవా చేశారు. వారం రోజులు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్‌ ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని అంశాలపై ఏమైనా చర్చించారా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో అమరవీరుల స్తూపానికి ఎకరం స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తామన్న రేవంత్.. డిసెంబరు 9 నుండి రాష్ట్రంలో పార్టీ నిర్మాణంకోసం సభ్యత్వ కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ సూచనలు, సలహాల మేరకు రాష్ట్రంలో పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నామని వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం గురించి రాహుల్‌తో చర్చించినట్లు తెలిపారు.

టీపీసీసీ టీమ్‌తో విడివిడిగా సమావేశం

ఢిల్లీలో టీపీసీసీ బృందంతో రాహుల్​గాంధీ విడివిడిగా సమావేశమయ్యారు. సమావేశంలో ముందుగా రాహుల్ గాంధీ అందరితో సమావేశం అయ్యారు. అనంతరం విడివిడిగా మాట్లాడారు. ప్రధానంగా రాష్ట్రంలో అమలవుతున్న దళిత బంధు, నిరుద్యోగ సమస్య, కేసీఆర్ కుటుంబ అక్రమాలు, అవినీతి, పోడు భూముల అంశాలు, హుజురాబాద్ ఉప ఎన్నికలు, రాష్ట్రంలో దళిత దండోరా సభలు తదితర అంశాలపై చర్చించారు.

రాహుల్ గాంధీతో సమావేశమైన వారిలో ఏఐసీసీ ఇంచార్జి మణిక్కం ఠాగూర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, కార్య నిర్వాహక అధ్యక్షులు గీతారెడ్డి, అజారుద్దీన్, మహేష్ కుమార్ గౌడ్, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, కన్వీనర్ అజ్మతుల్లా హుసేన్ తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed