వారు ఆశిస్తున్నవి బీజేపీతోనే సాధ్యం: మోడీ

by  |
వారు ఆశిస్తున్నవి బీజేపీతోనే సాధ్యం: మోడీ
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ప్రజలు మార్పును ఆశిస్తున్నారని, వారు ఆశించే అసలైన బెంగాల్ బీజేపీతోనే సాధ్యపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన బీజేపీ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని తెలిపారు. ఎన్నికలు జరగనున్న బెంగాల్‌లో ప్రధానమంత్రి తన రెండో పర్యటనలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హుగ్లీలో ఓ కార్యక్రమంలో ప్రజలనుద్దేశిస్తూ ప్రధాని మాట్లాడారు. బెంగాల్‌లో టీఎంసీ ఉన్నన్ని రోజులు అభివృద్ధి సాధ్యం కాదని, అప్పటి వరకు అవినీతి, సిండికేట్ పాలన, పన్నుల పేరిట దోపిడీ కొనసాగుతూనే ఉంటుందని ఆరోపించారు. తృణమూల్ ప్రభుత్వం తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి సంతుష్టవాద రాజీకయాలు చేస్తున్నదని, బీజేపీ అధికారంలోకి వస్తే అందరికీ అభివృద్ధి ఫలాలు అందజేస్తుందని అన్నారు. సంతుష్టవాద రాజకీయాలకు చెల్లుచీటి ఇస్తుందని తెలిపారు. బెంగాల్ ప్రజలు మార్పు కోసం నిర్ణయం తీసుకున్నారని, వారు కలలు కంటున్న సిసలైన బెంగాల్‌ బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల సంక్షేమ ఫలాలు రాష్ట్ర ప్రజలకు అందకుండా టీఎంసీ సర్కారు మోకాలడ్డిందని అన్నారు.

ఇక ఢిల్లీ అస్సామీల ఇంటి ముంగిట..

గత ప్రభుత్వాలు అసోం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి పట్ల సవతి ప్రేమను చూపించాయని ప్రధాని ఆరోపించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని హామీనిచ్చారు. దశాబ్దాలుగా పాలించిన గత ప్రభుత్వాలు దేశరాజధాని ఢిల్లీకి అసోం చాలా దూరంగా ఉన్నట్టు భావించేవారని విమర్శించారు. ఇప్పుడు ఢిల్లీ, దిస్‌పూర్ నుంచి దూరంగా లేదని, ఢిల్లీ అస్సామీల ముంగిట ఉన్నదని వివరించారు. ప్రధానమంత్రి సోమవారం అసోంను మూడోసారి(నెలలో) పర్యటించారు.

Next Story

Most Viewed