ఇది కూడా ఇటలీ ఐడియానే!

by  |
ఇది కూడా ఇటలీ ఐడియానే!
X

దిశ, వెబ్ డెస్క్: ఆదివారంనాడు దీపాలు, క్యాండిల్ లైట్లు, ఫ్లాష్ లైట్లు వెలిగించాలన్న మోడీ ప్రకటనపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తున్నది. ప్రధాని నరేంద్ర మోడీ మళ్లీ ఇటలీ నుంచి ఆ ఐడియాను అరువు తెచ్చుకున్నారని విమర్శలు వస్తున్నాయి. గతంలో జనతా కర్ఫ్యూనాడు వైద్యుల కృషికి కృతజ్ఞతలుగా చప్పట్లు కొట్టాలని ప్రధాని చేసిన అభ్యర్థనపై ఇటువంటి ఆరోపణలే వచ్చిన విషయం తెలిసిందే.

గత నెల 22న జనతా కర్ఫ్యూ పాటించాలని, కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్యులు, ఇతర ఉద్యోగులకు కృతజ్ఞతగా చప్పట్లు కొట్టాలని ప్రధాని మోడీ కోరారు. ఆ రోజు ప్రజలు పెద్ద ఎత్తున బయటకొచ్చి చప్పట్లు కొట్టి, వంటింటి పాత్రలను మోతమోగించారు. కొన్ని చోట్ల ర్యాలీలు కూడా తీశారు. వాస్తవానికి వైద్యులను అభినందిస్తూ చప్పట్లు కొట్టడం తొలుత ఇటలీలో కనిపించింది. కరోనా మహమ్మారితో అత్యధికంగా ప్రభావితమైన ఇటలీలో లాక్ డౌన్ అమలులో ఉండటంతో ప్రజలు తమ ఇంటి బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొట్టారు. పాటలు పాడారు. సంగీత వాయిద్యాలు పలికించారు. స్టీల్ పాత్రలతో చప్పుళ్లు చేశారు. ఒంటరిగా ఉన్నామనే భావనకు చెక్ పెడుతూ.. తామందరం ఐక్యంగా ఉన్నామన్నదానికి సంకేతంగా చాలా నగరాల్లో ప్రజలు బాల్కనీలోకి వచ్చి పలకరించుకున్నారు. రాత్రిపూట మొబైల్ ఫ్లాష్ లైట్లతో ఒకరి ముఖానికి ఒకరు కొట్టుకుంటూ ఆకాశంకేసి చూపిస్తూ కమ్యూనిటీ ఫీల్ ను కలిగించుకున్నారు.

తాజాగా ప్రధాని మోడీ ప్రజలను ఉద్దేశిస్తూ ఈ నెల 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇంట్లో లైట్ ఆఫ్ చేసి క్యాండిల్ లైట్లు, దిపాలు ముట్టించాలని, ఫ్లాష్ లైట్లు వెలిగించాలని అభ్యర్థించారు. కరోనా పై పోరాటంలో అందరం ఐక్యంగా ఉండాలని, కరోనా తీసుకొచ్చిన చీకట్లను ఈ వెలుతురుతోనే పారద్రోలాలని కవితాత్మకంగా వివరించారు. అయితే ఈ ఐడియా కూడా ఇటలీ నుంచి కాపీ చేసాందేనని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇటలీ వీడియోలు షేర్ చేస్తూ ఆ దేశ ప్రజలు ఎంచుకున్న పద్ధతులను… సర్కార్ ఇక్కడ మనవి చేసుకుంటున్నదని విమర్శిస్తున్నారు

వాట్సాప్ వర్సిటీ వింత వాదనలు…

వదంతులు, నకిలీ కథనాలు వాట్సాప్ లలో విరివిగా ప్రచారం అవుతుంటాయి. జనతా కర్ఫ్యూనాడు చప్పట్లు కొట్టడం వెనుక ఏదో మహత్తు ఉన్నదని.. ప్రభుత్వ ప్రకటనకు సమర్థింపుగా వాట్సాప్ లలో వింత వాదనలు వచ్చాయి. ఇప్పుడు ఫ్లాష్ లైట్ దీపాల వెలుతురు పైన అటువంటి కథనాలే చక్కర్లు కొడుతున్నాయి. ‘నాసా పరిశోధన ప్రకారం కరోనా వైరస్ వేడిని తట్టుకోలేదు. 130 కోట్ల మంది ఒక్కసారిగా క్యాండిల్ లైట్ వెలిగిస్తే ఉష్ణోగ్రత 9 డిగ్రీలు పెరుగుతుందని ఐఐటి ప్రొఫెసర్ తెలిపారు. కాబట్టి ఆదివారం రాత్రి 9 గంటల 9 నిమిషాల తర్వాత వైరస్ చచ్చిపోతుంది, కేంద్ర సర్కార్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది’ అనే మెసేజ్ ఇప్పటికే ఫార్వర్డ్ కావడం మొదలైంది. ఈ మెసేజ్ ఎంత అశాస్త్రీయమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Tags: Coronavirus, light candles, diya, italy idea, adoption, modi

Next Story

Most Viewed