ఆ యూనివర్సిటీ వివాదాలకు ఎమ్మెల్సీ కవిత ముగింపు పలికేనా..!

by  |
ఆ యూనివర్సిటీ వివాదాలకు ఎమ్మెల్సీ కవిత ముగింపు పలికేనా..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ విశ్వ విద్యాలయంలో నెలకొన్న వివాదాలకు ఎమ్మెల్సీ కవిత ముగింపు పలకనున్నారా అంటే అవుననే చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్న ఎమ్మెల్సీ కవిత.. తెయూ కేంద్రంగా జరుగుతున్న రాజకీయ, విద్యార్థి పోరాటాలకు గల కారణాలను తెలుసుకుని వాటికి చెక్ పెట్టేందుకు యత్నిస్తున్నారు. ఈ నెల చివరి వారంలో తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఆమె వచ్చేందుకు అంగీకరించినట్టు తెలిసింది. గురువారం తెలంగాణ విశ్వ విద్యాలయ వీసీ రవీంద్ర గుప్తా, రిజిస్ర్టార్ కనకయ్యలు ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిసి, విశ్వ విద్యాలయంలో జరుగుతున్న వివాదాల గురించి చెప్పినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలోనే తెయూలో రుసా నిధులతో నిర్మించనున్న సైన్స్ బిల్డింగ్ నిర్మాణ పనులకు వస్తానని కవిత సూచనప్రాయంగా తెలిపినట్లు సమాచారం. ఆ తర్వాత యూనివర్సిటీలో వెల్లువెత్తిన ఆరోపణలపై కవిత వివరణ కోరగా.. ప్రస్తుత అవసరాల మేరకు మాత్రమే ఔట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ చేశామని కవితకు వివరించినట్టు తెలుస్తోంది. దీనికితోడు పార్ట్ టైం లెక్చరర్‌ల నియమాకాలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయా అని ఆరా తీయగా.. నోటిఫికేషన్ లేకుండా జరిపామని చెప్పగా, వాటిని కూడా వెంటనే రద్దు చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని.. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని, మెరిట్ ద్వారా భర్తీ చేయాలని ఎమ్మెల్సీ కవిత ఆదేశించినట్టు సమాచారం.

యూనివర్సిటీలో పార్ట్ టైం లెక్చరర్ల తొలగింపు

తెలంగాణ విశ్వ విద్యాలయంలో ప్రస్తుతం కొనసాగుతున్న పార్ట్ టైం లెక్చరర్స్‌ను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు యూనివర్సిటీ అధికారులు. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ హెడ్‌లకు సమాచారం అందించారు. కొత్త వారిని తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిసింది.



Next Story