అందుకే కేసీఆర్‌ రెండు సార్లు సీఎం అయ్యారు: ఎమ్మెల్సీ కవిత

115

దిశ, భీమ్‌గల్: ఏడేండ్లలో తెలంగాణ దేశంలోనే అగ్రరాష్ట్రంగా నిలిచిందని.. దీనికి సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలే కారణమని ఎమ్మెల్సీ కవిత అన్నారు. భీమ్‌గల్ మండల కేంద్రంలో మంగళవారం జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఇందులో భాగంగా రూ. 30 కోట్లతో 18 అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు.

అనంతరం కవిత మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం ఎంత ప్రేమతో కొట్లాడినమో, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సీఎం కేసీఆర్ అంతే చిత్తశుద్ధితో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతుంటే, కొంత మంది రాజకీయాల కోసం ఇష్టారీతిన మాట్లాడుతున్నారని కవిత తప్పుబట్టారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమనడం సరికాదని పేర్కొన్నారు.

కొందరు బీజేపీ నాయకులు కేవలం రాజకీయాల కొసం బట్టేబాజ్ మాటలు చెప్తున్నారని విమర్శించారు. పనిచేసే నాయకులకు ప్రజల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందన్న కవిత.. అందుకే సీఎం కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలు రెండు సార్లు దీవించి ముఖ్యమంత్రిగా గెలిపించారని గుర్తు చేశారు. భీమ్‌గల్ పట్టణ కేంద్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పట్టణంలో త్వరలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని కవిత ప్రకటించారు.