ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డి భారీ స్కెచ్.. టీఆర్ఎస్‌లోకి ఉత్తమ్​టీమ్ ?

461

దిశ, తెలంగాణ బ్యూరో: టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ ​కుమార్​రెడ్డి టీంను టీఆర్​ఎస్ పార్టీలోకి లాక్కునేందుకు భారీ స్కెచ్ వేశారు. ఉత్తమ్ టీంతో మాట్లాడేందుకు ఆయన బంధువు, ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డి బరిలోకి దిగారు. ముందుగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని నేతలతో చర్చలు సాగిస్తున్నారు. దాదాపు ఏడేండ్లు టీపీసీసీ చీఫ్​ బాధ్యతలను నిర్వర్తించిన ఉత్తమ్​ కుమార్​రెడ్డి వర్గం.. ఇటీవల కొంత అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రేవంత్​రెడ్డికి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో బహిరంగ విమర్శలు చేస్తున్నారు. అయితే హుజురాబాద్​ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్​లో గ్రూపు రాజకీయాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. రేవంత్​రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ అప్పటి కాంగ్రెస్​ నేత కౌశిక్​రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.

ఆ తర్వాత టీఆర్​ఎస్​లో చేరారు. ఈ పరిణామాల్లో నేపథ్యంలో ఉత్తమ్​ కుమార్​రెడ్డిపై పలు ఆరోపణలు కూడా వచ్చాయి. కాగా ఇప్పుడు కౌశిక్​రెడ్డి.. అదే ఉత్తమ్​ వర్గీయులను టీఆర్​ఎస్​లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్​ చేస్తున్నారు. దీనిలో భాగంగా వరంగల్​, కరీంనగర్​ జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో ఇటీవల సంప్రదింపులు మొదలుపెట్టారు. కాంగ్రెస్​ పార్టీ.. అందులోనూ కేవలం ఉత్తమ్​ వర్గీయులతోనే చర్చలు సాగిస్తున్నారు. ఉత్తమ్​కు సమీప బంధువైన కౌశిక్​రెడ్డి.. కాంగ్రెస్​లో ఉన్నప్పుడు ఉత్తమ్​ వెంటే ఉన్నారు. ఆ తర్వాత టీపీసీసీ మార్పులు జరిగినా ఉత్తమ్​కు మద్దతుగా నిలిచారు. దీంతో ఉత్తమ్​ వర్గీయులు ఎవరెవరు అనే వివరాలన్నీ కౌశిక్​రెడ్డికి తెలిసిందే.

ప్రస్తుతం ఉత్తమ్​ టీంకు పార్టీలో ప్రాధాన్యత లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో వారందరినీ గులాబీ గూటికి చేర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా జనగామ జిల్లా నేతలతో ఒకదఫా చర్చలు పూర్తి అయ్యాయి. అయితే ఆ జిల్లా పార్టీ నేత.. తనకు అసెంబ్లీ టికెట్​ ఇవ్వాలని షరతు పెట్టినట్లు తెలుస్తోంది. జనగామ లేదా వరంగల్​ వెస్ట్​ నుంచి తనకు టికెట్​ ఇవ్వాలని, లేనిపక్షంలో ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని పార్టీ ముందు ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. అదేవిధంగా కరీంనగర్​ జిల్లాకు చెందిన మరో సీనియర్​ నేతతో కూడా కౌశిక్​రెడ్డి మంతనాలు చేస్తున్నట్లు సమాచారం.