అభ్యర్థుల్లో ఉత్కంఠ.. నేడు తేలనున్న భవితవ్యం

by  |
అభ్యర్థుల్లో ఉత్కంఠ..  నేడు తేలనున్న భవితవ్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: మరికొన్ని గంటల్లో ఉత్కంఠకు తెరపడనుంది. 6 ఎమ్మెల్సీ స్థానాలకు ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. దీంతో బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అధికారపార్టీకి చెందిన అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూనే మరో పక్క క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది.

రాష్ట్రంలో ఈనెల 10వ తేదీన కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు, మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరిగాయి. 6 ఎమ్మెల్సీ స్థానాలకు 26 మంది పోటీ చేశారు. మంగళవారం కౌంటింగ్ ప్రక్రియను చేపడుతున్నారు. ఉదయం 8 గంటలకు ఆయా జిల్లాలకు చెందిన కౌంటింగ్ కేంద్రాల్లో బాక్సులను ఏజెంట్ల సమక్షంలో ఓపెన్ చేసి లెక్కింపును ప్రారంభించి మధ్యాహ్నం వరకు ఫలితాలు వెల్లడించనున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు.

ఓట్ల లెక్కింపునకు ఆదిలాబాద్ లో 6 టేబుల్స్, కరీంనగర్ లో 9 టేబుల్స్, మెదక్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో 5 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 25 ఓట్ల చొప్పున బండిల్స్ చేస్తారు. కోవిడ్ నిబంధనల మధ్య కౌంటింగ్ జరుగుతుంది. వ్యాక్సినేషన్ వేసుకున్నవారికి మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లో అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద గుంపులుగా ఉండొద్దని ఇప్పటికే ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఫలితాలు వెలువడిన తర్వాత ఇద్దరు మాత్రమే వచ్చి సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్, కెమెరాలను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతి లేదు. నల్గొండ, మెదక్ లో రౌండ్స్ ఎక్కువ ఉండనున్నాయి. అయితే మొదటగా చెల్లుబాటు అయిన ఓట్లు, చెల్లుబాటు కానివి వేర్వేరు చేయనున్నారు. అనంతరం రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.

ర్యాలీలకు అనుమతి లేదు

ఓట్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత విజేతల ర్యాలీలకు అనుమతి ఎన్నికల సంఘం నిషేధించింది. కోవిడ్ ఆంక్షలు ఉండటం, గొడవలు జరిగే అవకాశం ఉందని భావించి ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట్ర చీఫ్ ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలు విధిగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రియారిటీ ఓట్ల లెక్కింపు

ఉమ్మడి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 1324 మంది ఓట‌ర్లకు గాను 1320 మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి మెద‌క్ జిల్లాలో 1026 మందికి 1018 మంది ఓటు వేశారు. ఉమ్మడి న‌ల్లగొండ జిల్లాలో 1271 మందికి 1233 మంది, ఉమ్మడి ఖ‌మ్మం జిల్లాలో 768 మందికి 738 మంది ఓటర్లు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 937 మంది ఓటర్లకు గాను 860 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇదిలా ఉంటే క‌రీంన‌గ‌ర్‌లో రెండు ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా, 10 మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎల్ ర‌మ‌ణ‌, భానుప్రసాద్ రావు పోటీలో ఉండగా, మరో 8 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ఇండిపెండెంట్ రవీందర్ సింగ్ గట్టిపోటీ ఇస్తున్నారు. ఖ‌మ్మం జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి.. టీఆర్ఎస్ నుంచి తాత మధుసూదన్, కాంగ్రెస్ పార్టీ నుంచి రాయల నాగేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థిగా కొండపల్లి శ్రీనివాసరావు, కొండూరు సుధారాణి పోటీలో ఉన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ నుంచి దండె విఠ‌ల్, స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణి బ‌రిలో ఉన్నారు. ఉమ్మడి మెద‌క్ జిల్లాకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జ‌ర‌గ‌గా, టీఆర్ఎస్ నుంచి యాద‌వ‌రెడ్డి, కాంగ్రెస్ త‌ర‌పున తూర్పు నిర్మల‌, ఇండిపెండెంట్ అభ్యర్థిగా మ‌ల్లారెడ్డి బ‌రిలో ఉన్నారు. ఉమ్మడి న‌ల్లగొండ జిల్లాలో ఒక ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ నుంచి ఎంసీ కోటిరెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు న‌గేశ్‌, ల‌క్ష్మయ్య, కే వెంక‌టేశ్వర్లు, ఈర్పుల శ్రీశైలం, బెజ్జం సైదులు, కొర్ర రామ్‌సింగ్ పోటీ చేశారు. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువగా ఉండటంతో ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో మెజార్టీ రాకపోతే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించనున్నారు.

క్రాస్ ఓటింగ్ పై స్వతంత్ర, కాంగ్రెస్ ఆశలు అధికార పార్టీకి అత్యధిక ఓట్లు ఉన్నాయి. గెలిచే అవకాశం వారికే ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వంపై, అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్, స్వతంత్ర అభ్యర్థులు ధీమాతో ఉన్నారు. అధికార పార్టీ క్యాంపులు నిర్వహించినా ఓటు మాత్రమే తమకే వేశారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వర్, కరీంనగర్ లో రవీందర్ సింగ్, ఆదిలాబాద్ లో పుష్పరాణి విజయంపై ధీమా వ్యక్తం చేస్తుండటంతో అధికార పార్టీ నాయకుల్లో లబ్ డబ్ నెలకొంది.

5 జిల్లాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఇవే…
జిల్లా కౌంటింగ్ కేంద్రం
ఆదిలాబాద్ టెక్నికల్ ట్రైనింగ్ డెవలప్ మెంట్ సెంటర్
నల్లగొండ టీటీడీసీ(డీఆర్డీఓ)
మెదక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల,
రూము నెంబర్ -2
ఖమ్మం జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్(డీపీఆర్సీ)
భవనంలోని సమావేశ మందిరం, రామాలయం వీధి
ఎన్ఎస్పీ క్యాంపు
కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
మరియు పీజీ కళాశాల
==============

అన్ని ఏర్పాట్లు పూర్తి
= రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ లోని ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 6 ఎమ్మెల్సీ స్థానాలకు 26మంది పోటీ చేశారని తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, 25ఓట్లను ఒక బ్యాండిల్ కడుతున్నామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామని, ఓట్ల లెక్కింపునకు 300 మంది, పోలీసు సిబ్బంది 200 మంది ఒక్కొక్క జిల్లాల్లో నియమించినట్లు తెలిపారు. ఉరేగింపును నిషేధించినట్లు తెలిపారు. మున్సిపల్ పంచాయతీ రాజ్ డిపర్ట్మెంట్ అధికారులపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఎవరైనా చేస్తే విచారణ జరిపిస్తామని వెల్లడించారు.



Next Story

Most Viewed