లోకేశ్ వెంట్రుక కూడా పీకలేరు: వైసీపీకి టీడీపీ నేత సవాల్

by  |
లోకేశ్ వెంట్రుక కూడా పీకలేరు: వైసీపీకి టీడీపీ నేత సవాల్
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగుతున్నారు. ఒకరిపై ఒకరు సవాల్‌, ప్రతిసవాల్ విసురుతున్నారు. శాసనమండలిలో క్రమంగా తమ బలం పెరుగుతోందని, అక్కడ నారా లోకేశ్‌ను ఆడుకుంటామంటూ మంత్రి కొడాలి నాని చేసిన ప్రకటనపై ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

శాసన మండలిలో ఇంకా తమ బలం ఉందనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తనలాంటి వాళ్లు 14 మంది ఉన్నారని..లోకేశ్‌కు వలయంగా ఉంటామని చెప్పుకొచ్చారు. ఆదివారం ఉదయం కడప జిల్లా జమ్మలమడుగులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ నాయకుల భాష ఏనాడూ హద్దులు దాటదని, పరిమితంగా మాట్లాడుతారని బీటెక్ రవి అన్నారు. ఆగ్రహావేశాలకు లోనైనప్పుడు నోరు జారడం సహజమేనని చెప్పారు. లోకేశ్ పాణ్యం నియోజకవర్గం పర్యటన సందర్భంగా కూడా ఇదే జరిగిందని.. దాన్ని తప్పు పట్టడం సరికాదన్నారు. జంట హత్యలు చోటు చేసుకున్న చోట సహజంగానే ఉద్రిక్తత ఉంటుందని, ఆ సమయంలో సీఎం జగన్‌నుద్దేశించి లోకేశ్ ఏరా అంటూ సంబోధించి ఉండొచ్చని బీటెక్ రవి అన్నారు.

అంతమాత్రాన పార్టీ నాయకులందరి భాషను తప్పు పట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. మండలిలో లోకేశ్ అంతు చూస్తామని హెచ్చరించడం సరికాదన్నారు. మండలిలో తనలాంటి సభ్యులు ఇంకా 14 మంది ఉన్నారని గుర్తు చేశారు. తాము ఉండగా కొడాలి నాని గానీ ఇంకెవరైనా లోకేశ్ వెంట్రుక కూడా పీకలేరని హెచ్చరించారు. లోకేశ్‌ను తిట్టడానికే కొడాలి నానికి వైఎస్ జగన్ మంత్రి పదవి ఇచ్చారని ధ్వజమెత్తారు. రెండేళ్ల తరువాత కొడాలి నానికి మంత్రి పదవి ఉంటుందో.. ఊడుతుందో కూడా తెలియదని బీటెక్ రవి ఎద్దేవా చేశారు.



Next Story

Most Viewed