భారత్ బంద్ ఉద్రిక్తం.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ కాన్వాయ్ అడ్డగింత

by  |
భారత్ బంద్ ఉద్రిక్తం.. ఎమ్మెల్యే శంకర్ నాయక్ కాన్వాయ్ అడ్డగింత
X

దిశ, దేవరుప్పుల : అఖిలపక్షం తలపెట్టిన భారత్ బంద్ దేవరుప్పుల మండల కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అఖిలపక్షం బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే దేవరుప్పుల మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకులు బంద్‌కు మద్దతు తెలుపుతూ జనగామ సూర్యాపేట జాతీయ రహదారి అయిన దేవరుప్పుల ప్రధాన చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. అదే సమయంలో అసెంబ్లీకి హాజరయ్యేందుకు వెళ్తున్న మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వాహనాన్ని అఖిలపక్ష నేతలు అడ్డుకొని నినాదాలు చేశారు. దీంతో అఖిలపక్ష బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని అఖిలపక్ష నేతలను అరెస్టు చేసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ వాహనాన్ని అక్కడి నుండి పంపించారు.ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అఖిలపక్షం బంద్‌కు ఎందుకు సహకరించడం లేదో చెప్పాలన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నిరసన ధర్నాలు, బంద్‌లు నిర్వహించిన తెరాస పార్టీ నాయకులు నేడు అఖిలపక్షం పిలుపునిచ్చిన బంద్‌కు సహకరించకపోవడం దేనికి సంకేతమన్నారు. బిజెపి పార్టీతో కుమ్మక్కై తెరాస పార్టీ అరాచక పాలన సాగించడం సిగ్గు చేటన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తూ డీజిల్, పెట్రోల్, గ్యాస్, రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నల్ల చట్టాలను అమలు పరుస్తూ.. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ పెరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఉప్పల సురేష్ బాబు సీపీఎం, సీపీఐ, బీఎస్పీ నాయకులు సింగారపు రమేష్, జీడి ఎల్లయ్య, బిల్ల తిరుపతి రెడ్డి, చింత ఏకలవ్య, నాయకులు పెద్ది కృష్ణమూర్తి, గండిపెళ్లి యాకయ్య, బోనగిరి యాకస్వామి, ఎండీ జాకీర్, రత్నాకర్ రెడ్డి, శోభన్ తదితరులు పాల్గొన్నారు.

Next Story