మా ఊరికి రావొద్దు..ఎమ్మెల్యే రాపాకకు జనసైనికుల ఝలక్ 

by  |
janasena
X

దిశ, ఏపీ బ్యూరో : తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు మరోసారి ఝలక్ ఇచ్చారు జనసేన పార్టీ కార్యకర్తలు. కాట్రేనిపాడు ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం సోమవారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.

దీంతో రాపాక రావద్దంటూ ప్లెక్సీలు వెలిశాయి. ఎమ్మెల్యే రాపాక గో బ్యాక్ అంటూ జనసేన కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కాట్రేనిపాడు గ్రామానికి చేరుకున్నారు. ఆ ప్లెక్సీలను తొలగించారు. జనసేనలో గెలచి పార్టీకి ఎమ్మెల్యే ద్రోహం చేసారంటూ జనసేన కార్యకర్తలు నిలదీసేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకుని జనసేన కార్యకర్తలతో చర్చలు జరిపి నిరసన కార్యక్రమాన్ని విరమింపజేశారు. అనంతరం ఎమ్మెల్యే కాట్రేనిపాడు ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత వెళ్లిపోయారు.

అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఎలాంటి సమస్య రాకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. ఇకపోతే రాపాక వరప్రసాదరావుకు వ్యతిరేకంగా గతంలోనూ ప్లెక్సీలు వెలిశాయి. జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కార్యక్రమానికి హాజరుకావొద్దంటూ జనసైనికులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత అనూహ్యంగా ముఖ్యమంత్రి జగన్‌కు మద్దతు ఇచ్చారు. కొద్దిరోజులకు తన కుమారుడిని జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేర్చారు. అప్పటి నుంచి రాపాక తీరుపై జనసైనికులు మండిపడుతున్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed