మంత్రి జగదీష్ రెడ్డికి సిగ్గు, శరం లేదు.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఆగ్రహం

by  |
MLA Komatireddy Rajagopal Reddy
X

దిశ, చౌటుప్పల్: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను అయినందుననే తన నియోజకవర్గ అభివృద్ధికి సహకరించడం లేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడేండ్ల నుంచి తన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేపట్టకుండా, రేషన్ కార్డుల పంపిణీకి మంత్రి జగదీశ్వర్ రెడ్డి రావడం సిగ్గుచేటని విమర్శించారు. తమ పార్టీలో గెలిచిన అభ్యర్థులను బెదిరించి టీఆర్ఎస్ పార్టీలో అక్రమంగా చేర్చుకుంటున్నారని మండిపడ్డారు. మంత్రి జగదీష్ రెడ్డికి దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం ఉంటే స్వతహాగా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని సవాల్ విసిరారు.

తాము గెలిపించిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను టీఆర్ఎస్‌లో అక్రమంగా చేర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్థాయిలేని ఆ ఎమ్మెల్యేతో తమపై విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట మున్సిపాలిటీలకు వేల కోట్ల నిధులు విడుదల చేసి అభివృద్ధి చేసుకుంటున్నారని అన్నారు. అదే మాదిరి మునుగోడు నియోజకవర్గంలోని చండూరు, చౌటుప్పల్ మున్సిపాలిటీలకు కూడా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే చౌటుప్పల్ మున్సిపాలిటీకి రూ.100 కోట్ల నిధులు కేటాయించాలని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దక్షిణ తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపిస్తోందని విమర్శించారు. చౌటుప్పల్‌లోని ఫార్మా ఇండస్ట్రీలతో పూర్తిగా కాలుష్యంగా మారుతుందని, దీనిపై ఎన్నోసార్లు అసెంబ్లీలో ప్రస్తావించినా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించడమే మునుగోడు నియోజకవర్గ ప్రజలు చేసిన తప్పా అని ప్రశ్నించారు. చౌటుప్పల్‌లోని దివిస్ ఫార్మా కంపెనీలో 90 శాతానికి పైగా నేటికీ ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారినే కొనసాగిస్తున్నారని అన్నారు. కరోనా కారణంగా గత రెండేండ్లు పోరాటాలకు దూరంగా ఉన్నానని, ఇక ఊరుకునేది లేదని హెచ్చరించారు. తనపై నమ్మకంతో గెలిపించిన మునుగోడు నియోజకవర్గ ప్రజలందరికీ రుణపడి ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్క శ్రీనాథ్, పట్టణ అధ్యక్షుడు మొగుదల రమేష్ గౌడ్, ఉప్పు భద్రయ్య, ఆకుల ఇంద్రసేనారెడ్డి, చింతల సాయిలు, జై కేసారం సర్పంచ్ కోర్పూరి సైదులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed