ధరణి సమస్యలపై ఎమ్మెల్యే ఫైర్.. రైతుల సమస్యలు పట్టించుకోరా

by  |
ధరణి సమస్యలపై ఎమ్మెల్యే ఫైర్.. రైతుల సమస్యలు పట్టించుకోరా
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా తయారైందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలు జీరో హవర్​లో ధరణి వెబ్​సైట్​లో తలెత్తుతున్న సమస్యల వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులనుద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ చట్టాల్లో ఉన్న లోపాలను సవరించి ధరణిని గొప్పగా ప్రారంభించిందని, అయితే సమస్యలు మాత్రం పరిష్కారం అవ్వకుండా అలాగే ఉన్నాయని ఆయన విమర్శలు చేశారు. రైతుల సమస్యలపై ఏ అధికారిని అడిగినా కలెక్టర్​ను కలవాలని సూచిస్తున్నారన్నారు. కలెక్టర్లు.. ఎమ్మెల్యేల ఫోన్​కాల్స్​కే స్పందించడంలేదని, ఇక సామాన్యులు, రైతులకు ఎక్కడ కలుస్తారని పేర్కొన్నారు.

నేటికీ డిజిటల్​సంతకాలు పెండింగ్​లోనే ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ధరణిని చూసి ఎన్నారైలు కూడా సంతోషిస్తున్నారని గొప్పలు చెబుతోందని, ఎన్నారై పోర్టల్​లో జీపీ అనే ఆప్షన్​పెండింగ్​లోనే ఉండటం వల్ల కుటుంబ సభ్యులకు గిఫ్ట్​గా ఇద్దామనుకుంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. రైతులకు చెందిన ఏదైనా ఒక సర్వే నంబర్‌లో నుంచి కాల్వనో, రోడ్డో వస్తే ఆ సర్వే నంబర్​మొత్తాన్ని అధికారులు బ్లాక్​చేస్తున్నారని, దీనివల్ల సంబంధిత రైతుకు రైతుబంధు, రైతుబీమా రాకుండా పోతోందని సభ దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సమస్యలపై కాల్​సెంటర్​కు ఫోన్​చేసినా వారి నుంచి స్పందన ఉండటం లేదన్నారు. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఫసల్​బీమా పథకాన్ని తీసుకొస్తే నేటికీ ప్రీమియం చెల్లించకుండా రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. అనుకోని విపత్తుల వల్ల రైతులు పంట నష్టపోతే ఫసల్​బీమా పథకం ఆదుకుంటుందన్నారు. ఈ ఏడేళ్లలో రైతుల పంట నష్టానికి రాష్ట్రప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో సమాధానం చెప్పాలని అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే రఘునందన్​రావు ప్రశ్నించారు. మొత్తం ఎంత పంట నష్టం జరిగిందో తెలపాలన్నారు. ఇకపోతే 2018 నుంచి రూ.1లక్ష రైతు రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్​హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఎంతమంది రైతులకు రుణమాఫీ చేశారో సమాధానం చెప్పాలన్నారు.

Next Story

Most Viewed