అది చూస్తే నాకే దు:ఖమొస్తోంది: టీఆర్ఎస్ ఎమ్మెల్యే

138
Challa-11

దిశ, పరకాల: వడగళ్ల వాన మిగిల్చిన పంట నష్టం దుఃఖాన్ని కలిగిస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం పరకాల, నడికూడ మండలాలకు చెందిన నాగారం, మలక్కపేట, నర్సక్క పల్లి, రాయపర్తి, పులిగిల్ల, చర్లపల్లి, చౌటుపర్తి, నడికూడ గ్రామాలలో వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, రెవెన్యూ అధికారులతో కలిసి నష్టపోయిన పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తీరా నోట్లోకి వచ్చే దశలో అకాల వర్షం ఒక్కరోజుతో తీరని నష్టాన్ని మిగిల్చిందని ఎమ్మెల్యే ముందు కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఈ విపత్తు తనని సైతం కలిచివేసిందంటూ ఎమ్మెల్యే వారిని ఓదార్చాడు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాను తిరుపతిలో ఉండగ అకాల వర్షం పరకాల ప్రాంతంలో చేసిన బీభత్సం సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిందన్నారు. వెంటనే రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతోపాటు మండలంలోని ప్రజాప్రతినిధులనతో టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడి రైతుల దగ్గరికి వెళ్లి పంట నష్టాన్ని పరిశీలించి, వారికి భరోసా కల్పించాలని ఆదేశించానన్నారు. వారి సూచనల మేరకు పండుగైన రైతుల కష్టాలు ప్రధానంగా భావించి పంటనష్టాన్ని పరిశీలించడానికి వచ్చినట్టు తెలియజేశారు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి ఫోన్ ద్వారా తీసుక పోయినట్లు తెలియజేశారు. వారు అందుబాటులో లేని కారణంగా ఇంకా స్పష్టమైన హామీ పొందలేకపోయామని తెలిపారు. నర్సంపేట నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉన్నందున పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రితో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.

రైతులపై బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంతో చర్చించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. రైతులను నట్టేట ముంచే మూడు నల్ల చట్టాలు తెచ్చి రైతాంగం తిరగబడడంతో వాటిని విరమించుకున్న పరిస్థితులు దేశ ప్రజలు మర్చిపోలేనివన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్ రావు, మున్సిపల్ పట్టణ వైస్ చైర్మన్ రేవూరి విజయ పాల్ రెడ్డి, ఆర్డీవో ఎం. వాసు చంద్ర, జేడీఏ, పరకాల ఎమ్మార్వో జనార్దన్ రావు, నడికూడ ఎమ్మార్వో సత్యనారాయణ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, నడికూడ మండల అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి, నడికూడ గ్రామ సర్పంచ్ ఊర రవీందర్ రావు, చౌటుపర్తి సర్పంచ్ గూడెం కృష్ణ అగ్రికల్చరల్ ఏడీఏ, పరకాల సీఐ పుల్యాల కిషన్ తదితరులు పాల్గొన్నారు.