బెజవాడలో భారీ రియల్ మోసం.. రోడ్డున పడ్డ కుటుంబాలు

by  |
real-estate 1
X

దిశ, ఏపీ బ్యూరో : బెజవాడలో ఎంకే కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ డెవలపర్స్‌ సంస్థ బోర్డు తిప్పేసింది. వెంచర్ల పేరుతో కొనుగోలు దారుల నుంచి సుమారు రూ.6 కోట్లు వసూలు చేసి దుకాణం సర్దేసింది. వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన పట్నాల శ్రీనివాసరావు 2020 ఆగస్టులో విజయవాడలోని గురునానక్‌ కాలనీలో ఎంకే రియల్‌ డెవలపర్స్‌ ఆఫీస్‌ను ఓపెన్ చేశాడు. ఆ కంపెనీకి ఛైర్మన్‌గా ఉప్పు మనోజ్‌కుమార్‌, డైరెక్టర్‌గా బలగం రవితేజ ఉన్నారు. అలాగే హైదరాబాద్‌ వనస్థలిపురంలోనూ ఒక బ్రాంచిని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ అభివృద్ధి చేసే స్థలాలు, ప్లాట్ల అమ్మకం, గేటెడ్ కమ్యూనిటీల్లో విల్లాలు విక్రయించేందుకు విజయవాడలో 20 మంది యువకులను ఏజెంట్లుగా నియమించింది.

విక్రయించిన ప్లాట్లలో ఏజెంట్లకు రెండు శాతం కమిషన్ ఇస్తామని ఆశచూపారు. అనంతరం విజయవాడకు సమీపంలో ఉన్న గన్నవరం, ముస్తాబాద్‌, ఆగిరిపల్లిలో ఉన్న స్థలాలను, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలు వెంచర్లను ఏజెంట్లకు చూపించారు. జీతంతో పాటు కమిషన్ కూడా వస్తుండటంతో ఏజెంట్లు భారీగా బుకింగ్స్‌ను తీసుకువచ్చారు. అంతేకాదు ప్లాట్లపై ఆఫర్లు ప్రకటించడంతో పలువురు కస్టమర్లు అడ్వాన్స్‌లు చెల్లించారు. విజయవాడ, గుంటూరు, కడప, శ్రీశైలం, విశాఖపట్నానికి చెందిన సుమారు 100 మంది లక్షల రూపాయలు అడ్వాన్సులుగా ఇచ్చారు. డబ్బు ఇచ్చిన వారు రిజిస్ట్రేషన్ల కోసం గత కొద్దీ రోజులుగా సంస్థ నిర్వాహకులకు ఫోన్ చేస్తున్నారు. అయితే, వారు స్పందించకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిర్వాహకుల కోసం గాలింపు చేపట్టారు.


Next Story

Most Viewed