మోసం చేస్తున్నారని తెలిసినా కూడా వాళ్లకే అమ్ముతున్నారు

by  |
మోసం చేస్తున్నారని తెలిసినా కూడా వాళ్లకే అమ్ముతున్నారు
X

దిశ‌, ఖ‌మ్మం: అదిగో క‌రోనా.. ఇదిగో లాక్‌డౌన్‌.. ఇక ఇప్పుడ‌ప్పుడే అంత‌ర్జాతీయ మార్కెట్ కుదురుకోదు.. మార్కెట్ల‌లో క‌నీస ధ‌ర కూడా లేదు. ఇప్పుడు అమ్ముకోకుంటే తక్కువ ధ‌ర‌కు అమ్ముకోవాల్సి వ‌స్తుందంటూ.. రైతుల‌ను ప్రైవేటు వ్యాపారులు భ‌యాల‌కు గురిచేస్తూ పంట‌ను కొనుగోలు చేస్తున్నారు. ఖ‌మ్మం జిల్లాలో ఈ ఏడాది 51,150 ఎకరాల్లో మిర్చి పంట‌ను సాగు చేశారు. దాదాపు 12.75 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చింద‌ని వ్య‌వసాయ శాఖ అధికారులు అంచ‌నావేశారు. ఈ ఏడాది ఖ‌మ్మం మార్కెట్ యార్డులో క్వింటాల్ మిర్చికి ధ‌ర రూ.22 వేల వ‌ర‌కు ప‌లికింది. మార్కెట్లో కొనుగోళ్లు ఆరంభ‌మైన తొలిరోజుల్లోనే గరిష్టంగా రూ.21 వేలకు ప‌లికింది. కానీ అంత‌ర్జాతీయ మార్కెట్లో మిర్చి డిమాండ్ త‌గ్గుతున్న‌ట్లు రైతులను వ్యాపారులు భయపెట్టారు.

తొలుత క్వింటాల్ కు రూ.16 వేలు, ఆ త‌ర్వాత రూ. 14 వేల‌కు కొనుగోళ్లు ఎక్కువ రోజులు చేశారు. లాక్‌డౌన్ తరువాత మిర్చి ధ‌ర‌ను వ్యాపారులు రూ.14 వేల నుంచి ఏకంగా రూ.8 వేల‌ కు త‌గ్గించి కొనుగోలు చేస్తూ రైతుల‌ను ద‌గా చేస్తున్నారు. అయితే కొంత మంది రైతులు కోల్డ్ స్టోరేజీల్లోకి త‌ర‌లించారు. జిల్లాలోని కోల్డ్ స్టోరేజీలు నిండిపోవ‌డంతో చాలామంది పంట ఉత్ప‌త్తిని ఇళ్ల‌ల్లోనే నిల్వ చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. అయితే కాలం గ‌డిచే కొద్ది మిర్చి పంట రంగు మార‌డం, ఆర్థిక అవ‌స‌రాలు పెర‌గ‌డం వంటి కార‌ణాల‌తో ఖ‌మ్మం మార్కెట్‌కు త‌ర‌లిస్తున్నారు. లాక్‌ డౌన్‌, క‌రోనా కార‌ణాలు చెప్పి ప్రైవేటు వ్యాపారులు త‌క్కువ ధ‌ర‌కు స‌రుకును కొనుగోలు చేస్తున్నార‌ని తెలిసి కూడా అమ్ముకోవాల్సి వ‌స్తోంద‌ని రైతులు వాపోతున్నారు.

రుణాలివ్వాలి..

పంట‌ను నిల్వ చేసుకునే అవ‌కాశం లేక‌పోవ‌డంతోనే అమ్ముకుంటున్నామ‌ని మిర్చి రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం త‌మ పంట ఉత్ప‌త్తిని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తే త‌క్కువ ధ‌ర‌కు అమ్ముకోవాల్సిన ప‌రిస్థితి ఉండేది కాద‌ని చెబుతున్నారు. లేదంటే ధాన్యం కొనుగోలు కేంద్రాల మాదిరిగానే మిర్చిని కొనుగోలు చేసేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చెల్లిస్తేనే మిర్చి రైతుల‌కు లాభాల విష‌యం ప‌క్క‌న పెడితే న‌ష్టాల నుంచైనా బ‌య‌ట‌ప‌డుతార‌ని చెబుతున్నారు.



Next Story