ఇప్పుడు ‘డబుల్’ ఇళ్లు.. త్వరలో 4.7లక్షల రేషన్ కార్డులు : కేటీఆర్

by  |
ktr-and-niranjan-reddy 1
X

దిశ, సిరిసిల్ల : పేద ప్రజలు ఆత్మ గౌరవంతో జీవించాలన్న ఉద్దేశ్యంతో పైసా ఖర్చులేకుండా ఇండ్లు లేని నిరుపేదలకు అన్ని సదుపాయాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం అందజేస్తుందని, డబుల్ ఇల్లు వారి ఆత్మగౌరవానికి ప్రతీకలని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితో కలిసి కేటీఆర్‌ బుధవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని అందుకే భారీ వ్యయంతో కూడుకున్నప్పటికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు.

ఇండ్ల కేటాయింపు పూర్తి పారదర్శకంగా చేపట్టామన్నారు. ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసి పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ స్థాయిలో ఇక్కడ గజం స్థలం లక్ష పలుకుతోందని.. అయినప్పటికీ ప్రభుత్వం ఇక్కడ పేదలకు ఇళ్లు నిర్మించిందన్నారు. కోట్లు విలువైన భూముల్లో ఇళ్లను నిర్మించి ఉచితంగా ఇస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం, వారి ఆత్మగౌరవం కాపాడేందుకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయించిందని, వాటిని సద్వినియోగం చేసుకుని పేద ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలన్నారు. తమ కాళ్ళ మీద తాము నిలబడి ఆత్మగౌరవంతో బ్రతకాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ పొందిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఒక మొక్కను నాటాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారుడికీ ఇళ్లు కేటాయిస్తామన్నారు. పేదవారి ముఖంలో సంతోషం చూడటమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ నల్లా ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ చెప్పారు. త్వరలో 4.7 లక్షల రేషన్‌కార్డులు ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. కాళేశ్వరం నీటితో సిరిసిల్ల త్వరలో కోనసీమలా మారబోతోందన్నారు. నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి పేటలో కోటి నిధులతో త్వరలో ఇండోర్‌ స్టేడియాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు.

Next Story