పిల్లలమర్రికి పూర్వవైభవం తీసుకురావాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్

by  |
Minister Srinivas Goud
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పిల్లలమర్రికి పూర్వ వైభవం తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని పిల్లలమర్రి విషయమై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చారిత్రాత్మక పిల్లలమర్రికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఆర్కాయాలజీకల్ పార్కును అభివృద్ధి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పిల్లలమర్రి వద్ద ఆర్కాయాలజీకల్ పార్కును అభివృద్ధి చేయడానికి రూపొందించిన వీడియో డాక్యుమెంటరీ ప్రతిపాదనలను మంత్రి పరిశీలించారు. పిల్లలమర్రిలో ఇప్పటికే పురావస్తు శాఖ ద్వారా మ్యూజియంను ఏర్పాటు చేశామన్నారు. మ్యూజియంకు అనుబంధంగా మరో రెండెకరాల విస్తీర్ణంలో ఆర్కాయాలజీకల్ పార్కును అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు.

ఈ పార్కులో ఆది మానవుని అవశేషాలను, శ్రీశైలం జలాశయంలో ముంపునకు గురైన దేవాలయాలు, కట్టడాల నమూనాలను ప్రదర్శించేందుకు ప్రదర్శన శాలను, హంపి థియేటర్‌ను, పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేందుకు, సుమారు 500 పురాతన విగ్రహాలు, 20 ఫిరంగులు, 10 ద్వారా బంధతోరణాలు ప్రదర్శన చేసేందుకు ఈ పార్కును అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హెరిటేజ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ నారాయణ, ఆర్కిటెక్చర్ కన్సల్టెంట్ రోహిత్ జోషి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed