బీజేపీపై ధ్వజమెత్తిన మంత్రి: పేర్ని నాని

by  |
బీజేపీపై ధ్వజమెత్తిన మంత్రి: పేర్ని నాని
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలపై జాలి, దయ లేకుండా ధరలు పెంచుతుందని విమర్శించారు. రాకెట్‌ కంటే వేగంగా పెట్రోల్‌, డీజీల్‌ ధరలు పెంచుతోందని, అటువంటిది రాష్ట్ర బీజేపీ నేతలు ధరల విషయంపై మకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

విజయవాడలో సోమవారం మంత్రి నాని మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలవుతున్నాయని, సంక్షేమ పథకాలలో ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచి ఇప్పుడు రూ. 5 తగ్గించి నీతులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలని సవాల్ చేశారు. మీరు ధర్నా చేస్తే మా పార్టీ తరపున నేను కూడా వస్తానని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సెస్‌ రూపంలో రూ. 2.85 లక్షల కోట్లు వసూలు చేసిందని పేర్కొన్నారు.

దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో కేంద్రానికి వ్యతిరేకంగా ఫలితాలు వెల్లడైతే అప్పుడు కళ్లు తెరిచి మొక్కుబడిగా రూ. 5 తగ్గించిందని ధ్వజమెత్తారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలితా రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఎంతఉన్నాయి మీరు ఎంత పెంచారో దమ్ముంటే బీజేపీ నేతలు చర్చకు సిద్ధం కావాలని మంత్రి నాని సవాల్ విసిరారు. రాష్ట్రంలో వస్తున్న ఎన్నికల ఫలితాలే మా ప్రభుత్వ ప్రజాధరణకు నిదర్శనమని రాష్ట్ర మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

మహాపాదయాత్ర విజయవంతం కావాలి: ఎంపీ రఘురామ

Next Story

Most Viewed