అక్కడ చంద్రబాబు పోటీ చేయడు..చేస్తే నాపై పోటీ చేయాలి: మంత్రి పెద్దిరెడ్డి..

by  |
peddi reddy
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమిపాలైందని చెప్పుకొచ్చారు. కుప్పంలో ఓటమికి పాలైన చంద్రబాబు ఇకనైనా రాజకీయాలకు స్వస్తి చెప్పి హైదరాబాద్‌కే పరిమితమై పరువు కాపాడుకోవాలని హితవు పలికారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంపై బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే గెలుపునకు కారణమని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ప్రజలంతా ఛీ కొట్టిన తర్వాత కూడా కుప్పం గురించి చంద్రబాబు మాట్లాడతాడని తాను అనుకోనని అన్నారు. ఇకనైనా చంద్రబాబు టీడీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుని..నందమూరి కుటుంబ సభ్యులకు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సమకాలీకుడు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యారని.. కానీ తన కుమారుడు లోకేశ్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయాడని చంద్రబాబు మదనపడుతున్నాడని ధ్వజమెత్తారు.

కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సుపుత్రుడు నారా లోకేశ్‌లు తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని.. తనను ఏకవచనంతో సంబోధిస్తూ అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. మానాన్నంత సాఫ్ట్ నేను కాదు.. నేను రౌడీని అంటూ లోకేశ్ ఎన్నికల ప్రచారంలో చాలా హంగామా చేశారని గుర్తు చేశారు. ఇకనైనా చంద్రబాబు, లోకేశ్‌లు మీ ఓటమిని అంగీకరించి రాజకీయాల నుంచి వైదొలిగితే మేం సంతోషిస్తామన్నారు. తనపై చంద్రబాబు.. లోకేశ్, టీడీపీ అనుచరగణం ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలాంటి పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తానని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు.

పుంగనూరు నుంచి పోటీ చేయండి చంద్రబాబూ!

కుప్పం నియోజకవర్గం ప్రజలు చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేస్తాడని తాను అనుకోనని చెప్పుకొచ్చారు. ఇప్పటికే అన్ని ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు, లోకేశ్‌ల రెండు చెంపలు వాయించారని..మళ్లీ కుప్పం రావొద్దని తేల్చి చెప్పేశారన్నారు. ఈ ఎన్నికల్లో ఫలితాలను చూసి ఇంకెందుకు పోటీ చేస్తారని ప్రశ్నించారు.

ఒకవేళ చంద్రబాబు పోటీ చేస్తాను అంటే ఎవరు కంటెస్ట్ చేయాలనేది అప్పుడే నిర్ణయిస్తామని.. మా వ్యూహాలు ఎలా ఉంటాయో ఆ ఎన్నికల్లోనే చూపిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు పుంగనూరు వచ్చి తనపై పోటీ చేయాలని మంత్రి పెద్దిరెడ్డి ఆహ్వానించారు. పోటీ చేస్తే జంట బాగుంటుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story