కేపీహెచ్‌బీ భూములను వేలం వేయండి.. మంత్రి కేటీఆర్ ఆదేశం

by  |
ktr-12
X

దిశ, సిటీ బ్యూరో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వానికి కొంత మేరకైనా ఆర్థిక ఉపశమనం కల్గించేందుకు ఇప్పటి వరకు ఖానామెట్, కోకాపేట, ఉప్పల్ భగాయత్ భూములను వేలం వేసి విక్రయించిన హెచ్ఎండీఏ.. ఇప్పుడు కేపీహెచ్ బీ భూముల వేలానికి సిద్దమైంది. కూకట్ పల్లిలోని ఫోరం మేజానా మాల్ పక్కనే ఉన్న హౌజింగ్ బోర్టుకు చెందిన 33 ఎకరాల భూమిలో 26 ఎకరాల్లో వంద అడుగుల వెడల్పుతో మెయిన్ రోడ్డును ఏర్పాటు చేసి రోడ్డుకిరువైపులా 12 నుంచి 14 వరకు ఫ్లాట్లు వచ్చేలా లే అవుట్ చేసి విక్రయించేలా డిజైన్ చేయాలని మున్సిపల్ మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. వీటితో పాటు ఇటీవల ఉప్పల్ భగాయత్ భూములకు నిర్వహించిన వేలంతో కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాని భారీ సైజులో ఉన్న ప్లాట్లను చిన్న ప్లాట్లుగా రీ డిజైన్ చేసి, వాటిని కూడా విక్రయించాలని ఆదేశించినట్లు సమాచారం. త్వరలోనే కూకట్ పల్లి, ఉప్పల్ భగాయత్ భూముల వేలానికి సంబంధించి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ను జారీ చేసే అవకాశాలున్నాయి. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో చిన్న సైజు ప్లాట్లకు మంచి ఆదరణ ఉన్నందున ఇటీవల వేలంలో మిగిలిన భారీ సైజు ప్లాట్లను చిన్న సైజు ప్లాట్లుగా విభజించి వేలం నిర్వహించాలని మంత్రి సూచించినట్లు తెలిసింది.

కూకట్ పల్లిలో తాజాగా విక్రయించనున్న ఈ భూమిలో బహుళ అంతస్తు భవనాలు వచ్చేందుకు వీలుగా, ఒక్కో ఫ్లాట్ ను కనిష్టంగా 6 వేల చదరపు గజాలు, గరిష్టంగా 9 వేల చదరపు గజాల్లో ఉండేలా హెచ్ఎండీఏ డిజైనింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ భూమి ఒక్కో గజం కనిష్టంగా రూ. 60వేలు, గరిష్టంగా రూ. 80 వేల వరకు ధర పలికే అవకాశాలున్నాయి.



Next Story

Most Viewed