10వేల మందికి నిత్యావసరాల పంపిణీ : మంత్రి కేటీఆర్

by  |
10వేల మందికి  నిత్యావసరాల పంపిణీ  : మంత్రి కేటీఆర్
X

దిశ, హైదరాబాద్: కరోనా మహమ్మారి ప్రబలకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. దీంతో నిరుపేదలు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సికింద్రాబాద్‌లో 10వేల మందికి నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమం తలపెట్టారు. దీనిని మున్సిపల్ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రారంభించారు. సీతాఫల్ మండిలోని TRT క్వార్టర్స్ వద్ద పలువురికి నిత్యావసర సరుకుల బ్యాగులను అందజేశారు. నిత్యావసరాలను ప్యాకింగ్ చేస్తున్న సీతాఫల్ మండిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రాంగణాన్ని మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అనంతరం సికింద్రాబాద్ పరిధిలోని సీతాఫల్ మండి, అడ్డగుట్ట, తార్నాక, మెట్టుగూడ, బౌద్ధనగర్ డివిజన్ల పరిధిలో సుమారు 10 వేల కుటుంబాలకు నిత్యావసర సరకులు పంపిణీ చేయనున్నట్టు డిప్యూటీ స్పీకర్ తెలిపారు.వీరందరికి 10 కిలోల నాణ్యమైన బియ్యం, 2 కిలోల కంది పప్పు, కిలో చెక్కెర, అరకిలో చింత పండు, 1 వంట నూనె ప్యాకెట్స్‌ను ఉచితంగా అందజేస్తామన్నారు. అర్హులైన వారికి ఇంటికి వెళ్లి ఈ ప్యాకెట్లు పంపిణీ చేస్తామని, ఎవరూ తమ కార్యాలయం వద్దకు గానీ, ఫంక్షన్ హాల్ వద్దకు తిరగాల్సిన అవసరం లేదన్నారు.కార్యక్రమంలో పద్మారావు గౌడ్‌‌తో పాటు నగర మేయర్ బొంతు రామ్మోహన్ , కార్పొరేటర్ కుమారి సామల హేమ, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఉప కమిషనర్ రవి కుమార్, తెరాస యువ నాయకులు తీగుల్ల కిశోర్ కుమార్, రామేశ్వర్, త్రినేత్ర గౌడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags: corona., lockdown, minister ktr, deputy speaker padmarao, ten thousand poor people, distribution

Next Story

Most Viewed