ప్లీనరీకి వచ్చే వారికి గుర్తింపు కార్డులు: మంత్రి కేటీఆర్

by  |
KTR1
X

దిశ, తెలంగాణ బ్యూరో: పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నామని, ఆహ్వానితులే హాజరుకావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప‌రిపాల‌న గొప్పగా సాగుతుంద‌ని, అపూర్వమైన విధానాల‌తో, పాల‌సీల‌తో దేశంతో పాటు ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలిచామ‌న్నారు. ఈ నెల 25న జరిగే పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ప్లీనరీ నిర్వహించే హైటెక్స్ ప్రాంగణాన్ని గురువారం పరిశీలించారు. ఏర్పాట్లపై పోలీస్, ఇతర విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అనేక సవాళ్లను ఎదుర్కొని, అద్భుతమైన ఉద్యమాన్ని నడిపి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనల మేరకు తెలంగాణ సాధించుకున్నామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్నారు. టీఆర్ఎస్ పార్టీ విధానాలను, పరిపాలనను మెచ్చి ప్రజలు మరోసారి ఆశీర్వదించారని వెల్లడించారు.

దేశ ప్రజలు, భారత ప్రభుత్వానికి సైతం తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రైతుబంధు లాంటి కార్యక్రమాల స్ఫూర్తితో పీఎం కిసాన్ ను కేంద్రం ప్రారంభించిందన్నారు. టీఎస్ ఐపాస్ వంటి అనుమతుల విధానాన్ని కూడా కేంద్రం త్వరలో తీసుకురాబోతోందన్నారు. ఒకప్పుడు బెంగాల్ చేసే పనిని రేపు భారత్ చేస్తుంది అనే నినాదం ఉండేదని, అది నేడు తెలంగాణ ఏం చేస్తుందో రేపు భారత్ అదే చేస్తుందన్నట్లుగా మారిందని, ఇంత గొప్పగా తెలంగాణ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నదని స్పష్టం చేశారు.

పార్టీ సాధారణ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని, సభ నిర్వహణ, దానికి సంబంధించిన ఏర్పాట్లను సమన్వయం చేసుకునేందుకు పార్టీ తరపున 8 కమిటీలను ప్రకటించారు. సభకు వచ్చే ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటారని కేటీఆర్ వెల్లడించారు.



Next Story

Most Viewed