ఏడున్నరేళ్లుగా తెలంగాణకు శూన్యహస్తమే: మంత్రి కేటీఆర్

by  |

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్‌లో తెలంగాణ, ఏపీలో పారిశ్రామీకరణ, ఉద్యోగాల కల్పన ప్రోత్సహించేందుకు ఇన్సెంటివ్‌లు ఇస్తామని కేంద్రం ప్రకటించినా ఏడున్నరేళ్లుగా శూన్య హస్తమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. భారతీయ పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయలో జరిగిన ‘మానెక్స్‌ 2021’ సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన కోసం భారీ పారిశ్రామిక పార్కులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. చైనా వంటి పెద్ద దేశాలతో ఉ‍త్పత్తి రంగంలో పోటీ పడాలంటే చిన్న పారిశ్రామిక పార్కులతో సాధ్యం కాదని, రాష్ట్రం ఏర్పాటు చేసిన మెగా పారిశ్రామిక పార్కులు ఫార్మాసిటీ, మెగా టెక్స్‌టైల్‌ పార్కులను కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

దేశం స్వయం స్వావలంబన సాధించేందుకు చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణలోకి తేవాలని కోరారు. యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రద్దు చేసిన కేంద్రం, ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారో చెప్పడం లేదని, ఏడున్నరేండ్లుగా ఐటీఐఆర్‌ కోసం కేంద్రానికి వినతులు చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ జనాభాలో తెలంగాణ 2.5 శాతమే అయినా దేశ జీడీపీకి 5శాతం సమకూరుస్తోందని, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత దేశ జీడీపీ సమకూర్చంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందన్నారు. ప్రగతిశీల విధానాలతో దేశ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణను వెన్నుతట్టి ప్రోత్సాహించాలని కేంద్రానికి వినతులు చేశామని, అయినా పట్టించుకోవడం లేదన్నారు.

హైదరాబాద్‌ దేశానికి ఆర్థిక ఇంజిన్‌గా పనిచేస్తోందన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను పునసమీక్షించి, వాటిని నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎదురైన సవాళ్లను ఎదుర్కోవడంలో పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని, చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) కాపాడుకునేందుకు కేంద్రంతో అనేక మార్లు సమన్వయం చేశామన్నారు. ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు కంటి తుడుపుగా కేంద్రం రూ.20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీ ప్రకటించిందని ఆరోపించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉత్తమ ప్రతిభ కనపరిచిన పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు అవార్డులు అందజేశారు. ఈ సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, సీఐఐ తెలంగాణ చైర్మన్‌ సమీర్‌ గోయల్‌, సీఐఐ కన్వీనర్‌ శోభా దీక్షిత్‌ తదితరులు పాల్గొన్నారు.

గిరిజన విద్యార్థికి అండగా కేటీఆర్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మామిడి గూడెం నుంచి ఐఐటీలో స్థానం సంపాదించుకున్న నిరుపేద కోయ తెగకు చెందిన గిరిజన విద్యార్థి కారం శ్రీలతకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఇంటర్మీడియట్లో 97 శాతం మార్కులను సాధించింది. నాగర్ కర్నూల్ లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో చదివి ఐఐటీ-జేఈఈ పరీక్ష ద్వారా ఐఐటీ వారణాసిలో ఇంజనీరింగ్ సీటు సాధించింది. అయితే వ్యవసాయ కూలీలుగా పనిచేసే తల్లిదండ్రులు ఆమె ఫీజులు చెల్లించే పరిస్థితిలో లేకపోవడంతో కేటీఆర్ ను ఆశ్రయించారు. స్పందించిన మంత్రి ఐఐటీ విద్య పూర్తయ్యేవరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆమె కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story