పద్యం చదివి.. కేసీఆర్ పాట పాడిన మంత్రి హరీష్..

by  |
పద్యం చదివి.. కేసీఆర్ పాట పాడిన మంత్రి హరీష్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్​ ప్రవేశపెట్టిన మంత్రి హరీష్​రావు ఓసారి పద్యం చదువుతూ.. మరోసారి పాట పాడారు. వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలో ప్రసంగం సందర్భంగా “ ఏదీ సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము ”అంటూ మహాకవి దాశరథి పద్యాన్ని అందుకున్నారు. అనంతరం ప్రసంగం మధ్యలో పాట పాడారు. ‘చూడు చూడు నల్లగొండ.. గుండె మీద ఫ్లోరైడ్ బండ.. బొక్కలొంకరుబోయిన బతుకులా.. మన నల్లగొండ.. దుఃఖమెల్లాదీసేదెన్నాళ్లు’ ఇది నల్లగొండ ప్రజల తాగునీటి కష్టాలను చూసి.. చలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రాసిన పాట అంటూ వివరించారు.

ఆనాడు ప్లోరైడ్ దుఃఖంమీద ఆవేదనతో పాటరాసిన ఆయనే ఇవ్వాళ ప్లోరైడ్ పీడను శాశ్వతంగా తొలగించారని, నల్లగొండలో ప్లోరైడ్ పీడ అంతమైందని, కొత్తగా ఎవరూ ప్లోరోసిస్ బారిన పడడంలేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా ప్రకటించిందని మంత్రి హరీష్​రావు అన్నారు. మిషన్ భగీరథ పథకం నల్గగొండ ప్లోరైడ్ కష్టాలకు చరమగీతం పాడిందని, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎండాకాలం వస్తే మహిళలు కుండలు పట్టుకుని మైళ్ల దూరం నడిచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేదని తెలిపారు. ఆదిలాబాద్ ఆదివాసి ప్రాంతంలో జనం కలుషిత నీరు తాగి డయేరియా కారణంగా మరణాలబారిన పడేవారని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం కేసీఆర్ ఐదేళ్లలోనే తాగునీటి కష్టాలు తీర్చారని, ప్రభుత్వం పట్టుదలతో పనిచేసి మిషన్ భగీరథ పథకాన్ని వేగంగా పూర్తి చేసిందని, తద్వారా రాష్ట్ర ప్రజలకు శుద్ధి చేసిన సురక్షిత జలాలు ఇంటింటింకి నల్లాల ద్వారా అందుతున్నాయని మంత్రి శాసనసభలో వివరించారు. మంత్రి పాటలు, పద్యాల సందర్భంగా సభ్యులు చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు.

Next Story