‘ఈటల’కు చెక్ పెట్టేందుకు మంత్రి హరీశ్ భారీ స్కెచ్.. రంగంలోకి సొంత కేడర్!

by  |
etala-harish
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఉపఎన్నికల్లో భారీ స్కెచ్‌తో ముందుకు సాగుతున్నారు మంత్రి హరీష్ రావు. లోకల్ లీడర్స్‌ను పబ్లిసిటీ కోసం వాడుకుంటూనే గ్రౌండ్ లెవల్లో మాత్రం తన సొంత కేడర్‌ను రంగంలోకి దింపారు. నియోజకవర్గం అంతటా కూడా తన నమ్మకమైన వారిని మోహరింపజేసిన మంత్రి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. ఈటల ఎపిసోడ్ తరువాత నుండి అధిష్టానం హుజురాబాద్ పై ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ సానుకూలత రాకపోవడంతో లోపాలను వెతికినట్టు తెలుస్తోంది. హుజురాబాద్ లోని ఐదు మండలాల్లో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నాయకులను రంగంలోకి దింపినా ఈటలపై పైచేయి సాధించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు కూడా రంగనాయక్ సాగర్ వేదికగా సమీకరణాలు చేసినా లాభం కనిపించలేదు. చివరకు హరీష్ రావు కూడా జోక్యం చేసుకుని డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది. స్థానిక నాయకులు చెప్తున్న విషయాలపై క్రాస్ చెక్ చేసుకున్న హరీష్ రావు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. దీంతో సిద్దిపేటకు చెందిన తన కేడర్‌ను హుజురాబాద్ కు పంపించారు. ప్రతి గ్రామానికి 10 నుండి 15 మంది చొప్పున తన అనుచర గణాన్ని రంగంలోకి దింపిన హరీష్ రావు వాస్తవ పరిస్థితులను అంచనా వేస్తూ ఎప్పటికప్పుడు ఈటలకు చెక్ పెట్టాలన్న యోచనలో ఉన్నారు. ఇక్కడి నాయకత్వం ఓటర్లను అంతగా ప్రభావితం చేయలేకపోతోందని గుర్తించిన మంత్రి హరీష్ రావు తన వ్యూహాన్ని మార్చి గ్రౌండ్ లెవల్ పాలిటిక్స్ కు శ్రీకారం చుట్టినట్టు సమాచారం.

ఆ భయమే కొంప ముంచిందా..

రాష్ట్రంలో ప్రతిపక్షాలన్ని కూడా దొరల పాలన అంటూ విమర్శలు చేస్తున్నాయి. గడీలను బద్దలు కొట్టాలని పిలుపునిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో హుజురాబాద్ బై పోల్స్ లో తమ సామాజిక వర్గానికి చెందిన వారిని రంగంలోకి దింపితే ప్రతికూలతను చవి చూడాల్సి వస్తోందని భావించిన అధిష్టానం తెరవెనక మంత్రాంగం నడిపించింది. మరో వైపున ఈటల బీసీ కావడంతో అక్కడ కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన నాయకులు ప్రచారం చేపడితే అగ్రవర్ణాల దాడి చేస్తున్నాయన్న ఆరోపణలు చేసే అవకాశం కూడా ఉంటుందని భావించారు. దీనివల్ల బీసీల్లో వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుందని, తాము తిరగడం వల్ల పార్టీ కన్నా ప్రత్యర్థికే ఎక్కువగా లాభం చేకూరుతుందని భావించి చాలా రోజుల పాటు అంటిముట్టనట్టుగా వ్యవహరించారు. కానీ, హుజురాబాద్ ప్రజల్లో టీఆర్ఎస్ అనుకూల పవనాలు మాత్రం వీయలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో హరీష్ రావు డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వడంతో పాటు తన కేడర్‌ను కూడా గ్రామ గ్రామాన మోహరింపజేశారని తెలుస్తోంది.

మినిట్ టూ మినిట్ అప్‌డేట్స్..

ఓ వైపున నిఘా వర్గాలు, సర్వే టీమ్స్, పార్టీ నాయకుల సమాచారాలే కాకుండా షాడో టీంలు కూడా హుజురాబాద్‌లో ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసేందుకు తిరుగుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్య నాయకులకు సంబందించిన కొంతమంది ప్రజల్లో మమేకమై, అధికార పార్టీ నాయకుల పనితీరుతో పార్టీకి కలుగుతున్న లాభం, వారు ఏం చేస్తున్నారన్న విషయాలు తెలుసుకునేందుకు కూడా సీక్రెట్ టీమ్స్ పనిచేస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. కొంతమంది ప్రముఖులు నియోజకవర్గంలో పర్యటించినప్పడు చేసిన కామెంట్ల గురించి కూడా టీఆరెెఎస్ అధిష్టానం దృష్టికి వెల్తుండడంతో ఈ ప్రచారానికి బలం చేకూరుతోంది. కొంతకాలంగా హుజురాబాద్ ప్రాంతానికి చెందిన వారితో ముఖ్య నాయకులు టచ్ లో ఉంటూ పరిస్థితులను తెలుసుకుంటున్నారని, వారే ఇప్పుడు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నారని భావిస్తున్నారు స్థానికులు.



Next Story

Most Viewed