బలవంతం లేదు..టీడీపీ ఉచ్చులో పడొద్దు: మంత్రి బొత్స

by  |
బలవంతం లేదు..టీడీపీ ఉచ్చులో పడొద్దు: మంత్రి బొత్స
X

దిశ, ఏపీ బ్యూరో: ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయడంలో ఎలాంటి బలవంతం లేదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. శాసనమండలిలో గురువారం మాట్లాడిన ఆయన స్కూళ్ల యాజమాన్యాలకు ప్రభుత్వం నాలుగు ఆప్షన్లు ఇచ్చినట్లు గుర్తు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఎయిడెడ్‌ స్కూళ్లపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గతంలో ఎయిడెడ్‌ విద్యావ్యవస్థను చంద్రబాబు భ్రష్టుపట్టించారని ఆరోపించారు.

ఎయిడెడ్‌ స్కూళ్లు, కాలేజీలలో ఉపాధ్యాయులు, అధ్యాపకులను నియమించలేదని.. నిధులు కూడా విడుదల చేయలేదని.. ఆయా విద్యాసంస్థల్లో విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే యోచన కూడా చంద్రబాబు చేయలేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు. నూతన విద్యా విధానం తీసుకొచ్చి ఏపీని దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉంచాలని సీఎం పరితపిస్తున్నారని చెప్పుకొచ్చారు.

విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకే ఎయిడెడ్‌ స్కూళ్ల వ్యవహారంలో జీఓలు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇకనైనా టీడీపీతోపాటు విపక్షాలు ఈ విషయంలో రాజకీయం చేయడం మానుకోవాలని మంత్రి హితవు పలికారు. ఎయిడెడ్ విలీనంపై బలవంతం లేదని.. ఇప్పటి వరకు విలీనం చేసిన వారు సొంతంగా నడుపుకుంటామని భావిస్తే వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉందని చెప్పుకొచ్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు తెలుగుదేశం పార్టీ కుట్రలో ఇరుక్కోవద్దంటూ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు.

Next Story

Most Viewed