‘పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలి’

by  |
‘పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలి’
X

దిశ, ఖమ్మం: లాక్‌డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి దాతలు కూడా ముందుకు వచ్చి తోడ్పాటు అందించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు. ఖమ్మం గ్రేయిన్ మార్కెట్ ప్రాంగణంలో టీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకుడు నున్నా మాధవరావు ఆధ్వర్యంలో గురువారం 400 మంది కార్మికులకు 100 క్వింటాళ్ల బియ్యం, మంచినూనే, ఇతర నిత్యావసర వస్తువులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ.. కార్మికులు పస్తులు ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డున్న నిరుపేదలకు 12కిలోల రేషన్ బియ్యం, రూ.1500 ఇస్తోందన్నారు. దీనికి తోడు అనేక మంది దాతలు కూడా ఆదుకునేందుకు ముందుకు రావడం సంతోషకరమన్నారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.1500 జమ‌ చేసిందని తెలిపారు. ఈ మేరకు గాంధీచౌక్, వైరా రోడ్‌లోని ఎస్బీఐ, యూనియ‌న్ బ్యాంకు ఆఫ్ ఇండియాల‌ను కలెక్టర్ కర్ణన్‌తో క‌లిసి సందర్శించారు. అక్కడి ఖాతాదారులను డబ్బులు పడ్డాయా అని అడిగారు. అలాగే, నగదు పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. బ్యాంకుల వద్ద టెంట్, కుర్చీలను ఏర్పాటు చేయాలన్నారు. నగదు పంపిణీ వివరాలను లీడ్ బ్యాంక్ మేనేజర్‌ను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకుల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించాలని కోరారు.

tags : Minister Ajay Kumar, distributed,essential commodities,workers,khammam

Next Story