ఎంజీఎంలో ఎన్ని సిత్రాలో.. కరోనా పరీక్షకు పోతే.. కష్టపడాల్సిందే..!

by  |
ఎంజీఎంలో ఎన్ని సిత్రాలో.. కరోనా పరీక్షకు పోతే.. కష్టపడాల్సిందే..!
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ఎంజీఎం ఆస్పత్రిలో కొవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్షల ప‌ర్యవేక్షణ‌ను ఆస్పత్రి అధికారులు గాలికి వ‌దిలేశారు. ప‌రీక్షల నిర్వహ‌ణ‌, సిబ్బంది ప‌నితీరును, ప‌నివేళ‌ల‌ను అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఇష్టారాజ్యంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. 11 గంట‌ల‌కు నిర్ధార‌ణ ప‌రీక్షలను మొద‌లు పెడుతున్న సిబ్బంది మధ్యాహ్నం 2 వ‌ర‌కే ప‌రీక్షలు నిర్వహించి, ఆ త‌ర్వాత ఇంటి ముఖం ప‌డుతున్నారు. వాస్తవానికి ఉద‌యం నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఆస్పత్రిలో ప‌రీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే అందుకు విరుద్ధంగా సిబ్బంది మ‌ధ్యాహ్నానికే సెంట‌ర్‌కు తాళం వేసుకుని వెళ్లిపోతుండ‌టంపై అధికారుల ప‌ర్యవేక్షణ లేమికి అద్దం ప‌డుతోంది.

ప‌రీక్షల కోసం ఎంజీఎంకు వంద‌లాది మంది..

పాఠ‌శాల‌ల‌కు విద్యార్థుల‌ను అనుమ‌తించేందుకు యాజ‌మాన్యాలు క‌రోనా నెగ‌టివ్ రిపోర్టును త‌ప్పనిస‌రి చేశాయి. అందునా కొన్ని పాఠ‌శాల‌లైతే ఆర్‌టీపీసీఆర్ (RTPCR) రిపోర్టును మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటుండ‌టం గ‌మ‌నార్హం. ఇంకొన్ని పాఠ‌శాల‌లు ఆర్‌ఏటీ (ర్యాట్‌) ప‌రీక్ష రిపోర్టుంటేనే ప్రవేశానికి అనుమ‌తిస్తున్నారు. విద్యార్థులను స్కూల్‌కు, హాస్టళ్లకు పంపించ‌డానికి క‌రోనా నెగ‌టివ్ రిపోర్ట్ కీల‌కంగా మారింది. ఈ ప‌రీక్షలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చాలా వ‌ర‌కు చేయ‌డం లేదు. ప్రముఖ‌మైన డ‌యాగ్నోసిస్ కేంద్రాలు కూడా దూరంగా ఉంటున్నాయి.

కొన్ని ఆస్పత్రుల్లో జ‌రుగుతున్నా ర్యాట్ టెస్ట్‌కు రూ.2వేలు, ఆర్‌టీపీసీఆర్ టెస్ట్‌కు అయితే రూ.5వేల వ‌ర‌కు వ‌సూలు చేస్తుండ‌టంతో, ఆ ఆస్పత్రుల వైపు వెళ్లాలంటే సామాన్య, బీద త‌ల్లిదండ్రులు జ‌డుసుకుంటున్నారు. ఈనేప‌థ్యంలో విధిలేని ప‌రిస్థితిలో ఎంజీఎం ఆస్పత్రికి పిల్లల‌ను తీసుకొస్తున్నారు. చాలా స‌బ్ సెంట‌ర్లలో, పీహెచ్‌సీల్లో క‌రోనా ప‌రీక్షల‌ను నిలిపివేసిన‌ట్లుగా ఆయా ప్రాంతాల నుంచి ఎంజీఎంకు వ‌చ్చిన ప్రజ‌లు ‘దిశ’ ప్రతినిధికి వివ‌రించారు.

ఓటీపీ రాదు.. రిపోర్టు ఇవ్వరు…

క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షల కోసం విద్యార్థులు, త‌ల్లిదండ్రులు, సామాన్య జ‌నం ఎంజీఎం కొవిడ్ నిర్ధార‌ణ కేంద్రం వ‌ద్ద బారులు తీరుతున్నారు. ప‌దుల సంఖ్యలో జ‌నం వ‌స్తున్నా.. తీరిపారిగా సేవ‌లందిస్తున్నార‌న్న విమ‌ర్శలున్నాయి. 11 గంట‌ల త‌ర్వాత గాని కొవిడ్ ప‌రీక్షల‌కు పేర్ల న‌మోదు ప్రక్రియ మొద‌లు కావ‌డం లేదు. 30 సెక‌న్లలోపు న‌మోదు చేయాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాతే ప‌రీక్షల‌కు అనుమ‌తి ల‌భిస్తుంది. ప‌రీక్షల అనంత‌రం ఫ‌లితాల‌ను సెల్‌కు పంపిస్తారు. అయితే స‌గంమందికి ఓటీపీ చిక్కులు ఎదుర‌వుతున్నాయి.

ఓటీపీ స‌రైన స‌మ‌యానికి రాక‌పోవ‌డంతో ప‌రీక్షలు చేయించుకోండి సెల్‌కు మెసేజ్ రాకుంటే మాకు సంబంధంలేదు. ఇక్కడి మ‌రుస‌టి రోజు వ‌చ్చి పేప‌ర్‌పై రాయంచుకోడంటూ సిబ్బంది చెబుతున్నారు. స‌ర్లే మ‌న ప్రాప్తం ఇలా ఉంద‌ని, మ‌రుస‌టి రోజు కేంద్రం వద్దకు వ‌చ్చిన వారికి సెంట‌ర్ మూసివేసి ఉండ‌టంతో షాక్‌ తింటున్నారు. తాను రెండు రోజులుగా వ‌చ్చి వెళ్తున్నాన‌ని, ఎప్పుడొచ్చినా సిబ్బంది ఉండ‌టం లేదని, సెంట‌ర్‌కు లాక్ వేసి ఉంటోంద‌ని ఓ వ్యక్తి చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. సెల్‌కు ఫ‌లితాలు రాక‌… ప్రత్యక్షంగా వ‌చ్చినా ఇవ్వకుండా న‌ర‌కం చూపిస్తున్నారంటూ ఎంజీఎం అధికారుల‌పై జ‌నం మండిప‌డుతున్నారు.



Next Story

Most Viewed