‘మిషన్ భగీరథ’కు మీటర్లు?

by  |
‘మిషన్ భగీరథ’కు మీటర్లు?
X

దిశ, తెలంగాణ బ్యూరో :
తాగునీటికి కూడా చార్జీలు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మిషన్ భగీరథ’కు మీటర్లు రానున్నాయి. వాడుకునే ప్రతి నీటి బొట్టుకు లెక్కలేసి మరీ చార్జీలు వసూలు చేయనున్నారు. దీన్ని పంచాయతీల నుంచి తీసుకోవాలా, లేక నేరుగా ప్రజల నుంచి వసూలు చేయాలా అనే అంశంపై అధ్యయనం సాగుతోంది. పట్టణాలలో ఉన్నట్టుగా ఇంటింటికీ మీటర్లు పెట్టి వాడుకున్న నీటికి రుసుము వసూలు చేయాలని భావిస్తున్నారు. మిషన్ భగీరథ నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. వారే రీచార్జ్ కూపన్ల తరహాలో వాటర్ కార్డులు చేసేలా, పంచాయతీకి నెలనెలా మెయింటనెన్స్ ఛార్జీలు చెల్లించే విధంగా ఉండేలా కూడా యోచిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలలో స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన మిషన్ల దగ్గర ఇది అమలులో ఉంది. దీనిపైనా ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రైవేట్‌కు అప్పగిస్తే?

మిషన్ భగీరథ నిర్వహణను రాష్ట్రస్థాయిలో ఒకే సంస్థ కాంట్రాక్ట్ తీసుకుంటుంది. జిల్లాలు, మండలాలవారీగా సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించనున్నారు. దేశానికే ఆదర్శమంటూ ఈ పథకాన్ని చేపట్టారు. ఇంటింటికీ నల్లాలు, గ్రామ గ్రామానికి వాటర్ ట్యాంకులు అంటూ పనులు చేశారు. చాలా వరకు పాత ట్యాంకులు, గతంలో ఉన్న ఇంట్రా విలేజ్ పనులనే పునరుద్ధరించారు. కొన్ని ప్రాంతాల్లో పాత పైపులైన్ల నుంచి నీళ్లు సరఫరా చేస్తున్నారు. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారంగా పరిగణిస్తోంది. ఇప్పటికే దీనిలోని దాదాపు రెండు వేలకు మందికిపైగా కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. ఇప్పుడు ఏకంగా ఈ పథకాన్ని ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాలని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

మీటర్లకే ప్రాధాన్యం

పలువురు ఇంజినీర్ల బృందం ఈ విషయం మీద పరిశీలన జరుపుతోంది. నెలకు ఎంత నీరు వినియోగిస్తారో అంచనా వేసి వాటర్ కూపన్లు జారీ చేయనున్నారు. ఒక కుటుంబం రోజుకు 100 లీటర్ల నీటిని వినియోగిస్తే నెలకు మూడు వేల లీటర్ల కూపన్ ఇవ్వనున్నారు. సొమ్ము చెల్లిస్తేనే వాటర్ కూపన్ రీచార్జ్ అవుతుంది. నెలనెలా బిల్లులుగా వసూలు చేసే విధానం కూడా ఉంది. బిల్లులు వసూలు చేయడం భారంగా ఉంటుందని, పంచాయతీలోనే కూపన్లు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఉదయం, సాయంత్రం మాత్రమే నీటిని పంపిణీ చేయనున్నట్లు పంచాయతీరాజ్ శాఖలోని ఓ ఇంజినీర్ వివరించారు. ఓ సంస్థ కూడా గ్రామాల్లో సొంత సర్వే చేసుకుంటోంది. ఎంత నీరు సరఫరా అవుతోంది, ఎన్ని గ్రామాలు, గ్రామాల్లో ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎంత మేరకు వసూళ్లు అవుతాయనే విషయాలన్నింటిపైనా సర్వే చేస్తున్నారు. ఈ వివరాలన్నీ తీసుకుని టెండర్లు వేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు సమాచారం.



Next Story

Most Viewed