నట్టింట్లో బుల్లితెర హవా..

by  |
నట్టింట్లో బుల్లితెర హవా..
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ‘మహాలక్ష్మి మంచితనాన్ని నందు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో.. భర్త అయ్యుండి మరీ అంత హార్ష్‌గా ఎలా బిహేవ్‌ చేస్తాడో. ఈ మగాళ్లు ఇంతే’ టీవీలో గృహలక్ష్మి సీరియల్‌ చూస్తూ అందులోని కథానాయిక పడే కష్టాలు తనే పడుతున్నంత బాధగా ఫీలవుతున్నది వంటింట్లో శ్రావణి. మరోఇంట్లో…‘పాపం ఆ అమ్ములుకెన్ని కష్టాలో… తల్లిదండ్రులే కాదంటే ఇంక ఆ పిల్ల గతేం కాను?’ అని చెబుతోంది మనవారాలితో బామ్మ అన్నపూర్ణమ్మ. ఇవి సీరియల్ ​అంటే ఆడవాళ్లవే.. అని చెప్పుకుంటున్నప్పటి నుంచి ఇంట్లో కనిపించే కామన్​ సీన్లే. కానీ ఇప్పుడు సీన్​మారింది. కరోనా పుణ్యమా అని మగవారికి, స్కూల్ పిల్లలకు సీరియల్ వైరస్ సోకింది. టీవీ సీరియల్స్ లో వచ్చే కథలు, అందులోని పాత్రల్లో దూరిపోతూ తెగబాధపడిపోతున్నారు. ‘అసలా సమీర్‌ కోకిలను చేసుకుంటాడో, సింధును చేసుకుంటాడో. సమీర్‌ కోకిల జోడి మాత్రం సూపర్‌ కదా..’ అంటూ మగవాళ్లు చర్చించుకుంటున్నారు. ఆఫీసులో.. చాయ్ సెంటర్ల గాసిప్ ​ముచ్చట్లు పోయి.. ఇప్పుడు సీరియల్ చర్చలు నడుస్తున్నాయి. ఇక స్కూల్​పిల్లలు అయితే ఆటలు ఆడేందుకు కలిస్తే.. చాలూ అరెయ్ నువ్వు సీరియల్​చూశావా అంటూ మాట్లాడేసుకుంటున్నారు.

కరోనా పుణ్యమా.. అని పిల్లలు, పెద్దలు ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ లు నిలిచిపోవడం.. ఇంకా ఇప్పటికీ కొత్తకొత్త సినిమాలు రిలీజ్ కాకపోవడంతో.. మూవీ ప్రేక్షకులంతా టీవీ సీరియళ్ల వైపు మళ్లారు. నిన్నటి, నేటి తరమంతా.. నట్టింట చేరిన బుల్లిపెట్టెలో వచ్చే వరుస సీరియళ్లను అర్ధరాత్రి వరకూ వరుసపెట్టి చూసేస్తున్నారు. దినమంతా బామ్మలైనా, భామలైనా వాటి గురించే మాట్లాడుకుంటున్నారు.

మగవాళ్లు సైతం..

జీళ్లపాకం సీరియల్స్‌ అని తిట్టుకునే మగవారు సైతం ‘మా కాలక్షేపం ఈ సీరియల్సే’ అని సీన్‌ మిస్సవ్వకుండా చూస్తున్నారు. కరోనా వైరస్ వల్ల నెలల తరబడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో మగవారు సైతం గడప దాడని పరిస్థితి. దీంతో మగవాళ్లు సైతం సీరియళ్ల వైరస్​ సోకినట్లు ఓ సర్వేలో వెల్లడైంది. అందుకే ఆ సీరియళ్లు వెయ్యిన్నొక్క ఎపిసోడు, రెండువేల రెండో ఎపిసోడు అంటూ రికార్డులు తిరగరాసుకుంటున్నాయి. ఇంతకీ ఈ సీరియల్స్‌ మన నట్టింట్లో ఎప్పుడు ఎలా అడుగు పెట్టాయి? ఏళ్లపాటు కొనసాగే వీటి ఉనికి ఎన్నేళ్ల క్రితం మొదలైంది తెలుసుకోవడం కూడా ఆసక్తి పుట్టిస్తుంది. నెక్ట్స్​ కథనంలో ఏమవుతుందో అనే ప్రేక్షకుడి ఆసక్తే ఈ సిరియల్స్‌కు అసలు సిసలు పెట్టుబడి అవుతోందన్నది ముమ్మాటికీ నిజం.

అడిక్ట్ అయిన ​పిల్లలు

స్కూళ్లు తెరుచుకోలేదు. దీంతో పిల్లలు ఇంటి వద్దే ఉంటూ క్లాసులు వింటున్నారు. ఈ క్రమంలో పిల్లలు సైతం సీరియళ్లకు అడక్ట్​ అయ్యారు. తల్లిదండ్రులతో కలిసి టీవీ చూస్తూ లీనమైపోతున్నారు. భావోద్వేగాలకు గురవుతున్నారు. అయ్యే ఇలా అయితే బాగుండునని బాధపడిపోతున్నారు. మిత్రులను కలిసినప్పుడు కుశల ప్రశ్నలకు బదులు సీరియల్​ చూశావా..? ఇలా అయిందిరా..? అలా చేస్తే బాగుండురా అంటూ చర్చించుకుంటున్నారు. ఈ సీరియల్​బాగా ఉంది అంటే.. మేం చూసే సీరియల్​లో మంచి సస్పెన్షన్ ఉంటుందిరా అంటూ చెప్పుకుంటున్నారు. ​

రేడియె నుంచి టెలివిజన్ కు

ధారావాహిక అనేది ముందు అమెరికాలో మొదలైంది. అక్కడి రేడియోలో ‘గైడింగ్‌ లైట్‌’ అనే నాటకం 1937 నుంచి 1956 వరకు దాదాపు 19 ఏళ్లపాటు ప్రసారమైంది. దీనిలో చాలా పాత్రలు, భావోద్వేగ బంధాల మధ్య కథనం సాగేంది. టీవీ ప్రాచుర్యంలోకి వచ్చాక అదే నాటకం జూన్‌ 30, 1952 నుంచి సెప్టెంబర్‌ 18, 2009వరకు దాదాపు 57 ఏళ్లపాటు సీరియల్‌గా ప్రసారమైంది. టెలివిజన్‌ చరిత్రలోనే ఫస్ట్‌ అండ్‌ లాంగెస్ట్‌ రన్నింగ్‌ డ్రామాగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌లో పేరు సంపాదించుకున్న ఈ సీరియల్‌ అమెరికా బ్రాడ్‌కాస్ట్‌ చరిత్రలోనే విశేషంగా చెప్పుకోదగినది. అంటే అటు రేడియో, ఇటు టీవీ మాధ్యమాల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ప్రసార కాలం 72 ఏళ్లు అన్నమాట. దీని విజయంతో యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో సీరియల్‌ ట్రెండ్‌ విస్తరించింది. ఇక ఈ సీరియల్స్‌ని మొదట సబ్బుల (సోప్‌) తయారీదారులు స్పాన్సర్‌ చేసేవారు. అందుకే వీటికి సోప్‌ వారు నిర్వహించే ధారావాహిక అనే పేరు వచ్చింది. ఆ తర్వాత ‘సోప్‌ ఒపెరా’ పేరు అంతర్జాతీయంగా ఖరారైంది.

మన నట్టింట్లోకి ప్రవేశం..

ఇండియన్‌ టెలివిజన్‌లో మొట్టమొదటగా అడుగుపెట్టిన డ్రామా సిరీస్‌ ‘హమ్‌ లోగ్‌’. దూరదర్శన్‌లో ఈ సీరియల్‌ 1984 జూలై 7న ప్రారంభమై 17 డిసెంబర్‌ 1985 వరకు 154 ఎపిసోడ్స్​ ప్రసారమైంది. 1980 నాటి మధ్యతరగతి కుటుంబంలోని నిత్య సంఘర్షణలు, వ్యక్తుల ఆకాంక్షల గురించిన కథనంతో విద్య–వినోదం ప్రధానాంశంగా ఈ సీరియల్‌ సాగింది. ముఖ్యంగా సామాజికాంశాలైన కుటుంబ నియంత్రణ, కుల సామరస్యం, మహిళా సాధికారత, జాతీయ సమైక్యత, కట్నం, మద్యపానం– మత్తు పదార్థాల దుర్వినియోగం.. వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ఈ సీరియల్‌ని తీశారు. మారుతున్న కాలంతోపాటు టీవీ చానెళ్ల సంఖ్య సైతం పెరుగుతూ వచ్చింది. మొదట్లో ఒకటో రెండో సీరియల్స్‌ సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారమయ్యేవి. శని, ఆదివారాల్లో ప్రత్యేక కార్యక్రమాలు వచ్చేవి. ప్రస్తుతం సమయం, వారాలతో పని లేకుండా లెక్కలేనన్ని టీవీ చానళ్లు. కొన్ని సీరియల్స్‌ అయితే మూడు వేల పైనే ఎపిసోడ్లు నడుస్తుండడం గమనార్హం. దీన్ని బట్టే టీవీ చానళ్లలో సీరియల్స్‌ హవా ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


Next Story

Most Viewed