‘గులాబీ‘ సెగలు.. బయటపడుతున్న వర్గపోరు

by  |
Membership registration, TRS leaders
X

టీఆర్ఎస్ నేతలకు సభ్యత్వ నమోదు సమస్యగా మారింది. ద్వితీయశ్రేణి నాయకత్వం అసంతృప్తితో రగులుతున్నది. పార్టీలో ప్రాధాన్యం లేదంటూ రచ్చకెక్కుతోంది. ఇలాంటి సమయంలోనే 85 లక్షల సభ్యత్వాలను టార్గెట్‌గా​ పెట్టడం నేతలకు కత్తిమీద సాములా మారింది. నియోజకవర్గాలలో వర్గపోరు ఇదే సందర్భంలో బయటకు వస్తోంది. సభ్యత్వ నమోదు మొదలుపెట్టిన రోజే ఎమ్మెల్యే రోహిత్​రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్​రెడ్డి వర్గీయుల మధ్య విభేదాలు పొడసూపాయి. ఇలాంటి పరిస్థితులు చాలా సెగ్మెంట్లలో కనిపిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: నిజానికి సభ్యత్వ నమోదు టీఆర్ఎస్‌కు పెద్ద సమస్య కాదు. గతంలో 60 లక్షల సభ్యత్వాలను చేయించారు. సభ్యత పుస్తకాలన్నీ నింపి రుసుం చెల్లించారు. సభ్యత్వం తీసుకుంటే రూ. రెండు లక్షల ఇన్సూరెన్స్​ వస్తుండటంతో కార్యకర్తలు ఉత్సాహం చూపించారు. ఇప్పుడు కూడా సభ్యత్వ నమోదు తర్వాత కమిటీలు ఏర్పాటు చేస్తామని, నామినేటెడ్​ పోస్టులు భర్తీ చేస్తామని వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ నేతలకు హామీ ఇచ్చారు. సభ్యత్వం బాగా చేయించినవారికే పెద్దపీట వేస్తామని చెప్పారు. దీంతో నేతలలో ఆశలు చిగురించాయి. ఇప్పటికే ద్వితీయ శ్రేణి నాయకులు నామినేటెడ్‌ పదవుల కోసం పైరవీలు మొదలెట్టారు. పార్టీ కమిటీల నియామకం పూర్తయితే నామినేటేడ్‌ పోస్టులు భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధిష్టానం కూడా ఆశలు కల్పిస్తోంది.

ఇప్పుడెలా మరి.?

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా ప్రజాప్రతినిధులకు సభ్యత్వ నమోదు టెన్షన్‍ పట్టుకొంది. ఒక్కో ఎమ్మెల్యేకు కనీసం 50 వేల సభ్యత్వాల టార్గెట్‍ ఇచ్చారు. గతంలో నమోదు ప్రక్రియ మూడు నెలల వరకు కొనసాగింది. ఈసారి ఈ నెల 25 వరకు గడువు పెట్టుకున్నా, సీఎం కేసీఆర్​ బర్త్​ డే వరకు ఎక్కువగా చేయించాలని ఆదేశించారు. దుబ్బాక, గ్రేటర్‍ హైదరాబాద్‍ ఎలక్షన్లలో బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడం సభ్యత్వ నమోదుపై ఎఫెక్ట్​ పడుతోంది. ఉద్యమ సమయంలో, తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు సభ్యత్వ నమోదును ఎలాగో కానిచ్చారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. టీఆర్‍ఎస్‍ పట్ల యూత్‍ నెగెటివ్‍గా ఉన్నారని పార్టీ నేతలే చెప్పుతున్నారు. పార్టీ కమిటీలు ఎన్నిక కూడా ఇబ్బందులను తెచ్చి పెడుతోంది. పదవులు రాని వారు పార్టీ మారేందుకు సిద్ధమవున్నారు. పార్టీ పదవి ఉన్నా నామమాత్రమే. ఉద్యమ సమయం నుంచి కష్టపడుతున్నా కనీస మర్యాద లేదని, కిందిస్థాయిలో నేతలను పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చిందంటే కచ్చితంగా ఏడెనిమిది లక్షలు జేబులో నుంచి పెట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కొన్నిచోట్ల కిందిస్థాయి నేతలపై వదిలేస్తున్నారు. దీంతో తప్పలేక సభ్యత్వ పుస్తకాలను నింపి ఇవ్వాల్సి వస్తోంది.

తప్పని వర్గపోరు

చాలా నియోజకవర్గాలలో వర్గ విభేదాలు ఎక్కువవుతున్నాయి. చిన్న జిల్లాలు ఏర్పాటు కావడం, ఒకరిద్దరిదే ఆధిపత్యం ఉండటంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య విభేదాలు వస్తున్నాయి. ఇది పార్టీపై ప్రభావం చూపిస్తోంది. ద్వితీయ శ్రేణి నేతలను వర్గాలుగా చూస్తున్నారు. టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం తొలిరోజే రచ్చ జరిగింది. యాలాల మండలంలో శుక్రవారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సమక్షంలోనే మాటల యుద్ధం కొనసాగింది. వేదికపైనే దూషించుకున్నారు. వరంగల్​ జిల్లాలో కూడా ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య ఇలాంటి గొడవ జరిగింది. ఇది మంత్రి కేటీఆర్​ దగ్గర కూడా చర్చగా మారింది. కరీంనగర్​ కార్పొరేషన్​లో కూడా మేయర్​, కార్పొరేటర్ల మధ్య విభేదాలు వచ్చాయి. మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లాలో ద్వితీయ స్థాయి నేతలు సభ్యత్వ నమోదుకు దూరంగా ఉంటామని బహిరంగంగానే చెబుతున్నారు.

ఎందుకు చేయాలి?

పార్టీ కోసం అన్నీ మీదేసుకుని పని చేస్తున్నా గుర్తింపు లేదని, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని, చిన్న చిన్న పనులు కూడా ఇవ్వడం లేదంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల కాలంలో ఆర్థికంగా నష్టపోయామని, పార్టీలో కీలకంగా పని చేస్తున్నా ఆర్థికంగా కలిసి వచ్చే పనులు ఇవ్వడం లేదని, ప్రతి అంశంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులే పంచుకుంటున్నారంటూ మండిపడుతున్నారు. దీంతో పార్టీకి సభ్యత్వ నమోదు, కార్యక్రమాలు అంటే ముందుండాలని చెప్పుతున్నారని, కానీ ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం మమ్మల్ని రానీయడం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ముఖ్య నేతలు వెళ్లి పిలుస్తున్నా మండల స్థాయి నేతలు మాత్రం వెళ్లడం లేదు. ఇదే క్రమంలో జిల్లాల వారీగా ఇన్ చార్జిలుగా వ్యవహరిస్తున్న పార్టీ నేతలు వెళ్లినా స్పందన కరువవుతోంది.

Next Story