సభ్యత్వ సందడి

by  |
సభ్యత్వ సందడి
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : గులాబీ పార్టీలో సభ్యత్వ సందడి నెలకొంది. ప్రతీ రెండేళ్లకో సారి మెంబర్​షిప్​డ్రైవ్​తోపాటు పార్టీ సంస్థాగత కార్యవర్గాలను వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఏప్రిల్ లో జరిగే పార్టీ ప్లీనరీ, ఆవిర్భావ దినోత్సవం నాటికి సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం పూర్తి చేస్తారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మూడు రోజుల క్రితం ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, 25నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం జిల్లాల వారీగా ఇన్​చార్జిలు వేయగా.. తూర్పు, పశ్చిమ జిల్లాలకు పరిశీలకులను కూడా నియమించారు.

ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్​ఎస్​ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా ఎదిగింది. 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన పార్టీ.. ఈ ఏడాది ఏప్రిల్ 27తో రెండు దశాబ్దాలు పూర్తి కానుంది. ప్రతీ రెండేళ్లకోసారి పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు సంస్థాగత నిర్మాణం చేపడతారు. ఇందులో భాగంగా ఈ సారి మూడు రోజుల క్రితం శ్రీకారం చుట్టగా, 25 లోగా కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రతి జిల్లాకు ఒక సెక్రటరీని ఇన్​చార్జిగా నియమించగా, తూర్పు, పశ్చిమ జిల్లాలకు ఇద్దరు జనరల్ సెక్రటరీలను ఇన్​చార్జిలను వేశారు. నిర్మల్ జిల్లాకు టీఎస్ డీడీసీ చైర్మన్​లోక భూమారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాకు అరిగెల నాగేశ్వరరావును సెక్రటరీ ఇన్​చార్జిలుగా వేయగా.. జనరల్ సెక్రటరీ ఇన్​చార్జిగా ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ ను నియమించారు. మంచిర్యాల జిల్లాకు గూడూరి ప్రవీణ్, ఆసిఫాబాద్ జిల్లాకు ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్ ను సెక్రటరీ ఇన్​చార్జిగా వేయగా.. జనరల్ సెక్రటరీ ఇన్​చార్జిగా రాష్ట్ర గిరిజన, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్​ను నియమించారు.

ఉమ్మడి జిల్లాలో 5 లక్షలు..

ప్రతి నియోజకవర్గానికి 50వేల చొప్పున సభ్యత్వ నమోదు లక్ష్యం కాగా, అంతకు మించి నమోదు చేస్తారని పార్టీ ఇన్​చార్జిలు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మేర సభ్యత్వం నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. కొన్ని నియోజక వర్గాల్లో 60 వేల వరకు అవుతుందని చెబుతున్నారు. సాధారణ సభ్యత్వం రూ.35 చొప్పున రుసుం ఉండగా.. క్రియాశీల సభ్యత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.50 చొప్పున, ఇతరులకు రూ.100చొప్పున రుసుం తీసుకుంటున్నారు. 3.50 లక్షల వరకు క్రియాశీల సభ్యత్వం నమోదు అవుతుందని.. మరో 2 లక్షల వరకు సాధారణ సభ్యత్వం నమోదయ్యే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి, సభ్యత్వ నమోదును ప్రారంభించారు. రెండు వారాల్లోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలకు సభ్యత్వ నమోదు పుస్తకాలు అందజేశారు. 25నాటికి మొత్తం పూర్తి చసి, ఆన్​లైన్ లో నమోదు చేయనున్నారు. ఏప్రిల్ 27న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి సంస్థాగత నిర్మాణం పూర్తి చేస్తారు. గ్రామం నుంచి రాష్ట్రం వరకు అన్ని కమిటీల నిర్మాణం పూర్తి చేయనున్నారు.

రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్​రెడ్డి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్మల్ లో ప్రారంభించగా.. గ్రామాలు, మండలాల వారీగా సభ్యత్వ నమోదు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరుఉ షురూ చేశారు. గతంలో కంటే ఈ సారి ఎక్కువ మొత్తంలో సభ్యత్వ నమోదు అవుతుందని.. ప్రభుత్వం, పార్టీ చేస్తున్న కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతున్నారని మంత్రి అల్లోల ‘దిశ ప్రతినిధి’తో పేర్కొన్నారు. పార్టీ పట్ల ప్రజల్లో మంచి స్పందన ఉందని, కుల, మతాలకతీతంగా అందరూ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని, పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు చేపట్టి అగ్రగామిగా నిలుస్తామన్నారు.



Next Story

Most Viewed