సింగరేణిలో మెడికల్ అన్ ఫిట్ దందా.. ఆత్మహత్యలు చేసుకుంటున్న కార్మికులు

by  |
Singareni-1
X

దిశ, గోదావరిఖని : చీకటి గుళాయిలు.. గుడ్డి దీపాల వెలుతురు.. తట్ట చమ్మస్‌తో బొగ్గు వెలికితీత.. అనుక్షణం ప్రాణభయం.. ఇది సింగరేణిలో ఒకప్పటి పరిస్థితి. ఆధునిక సౌకర్యాలు అత్యాధునిక యంత్రాలతో బొగ్గు ఉత్పత్తి నేటి పరిస్థితి. ఇలా దినదిన అభివృద్ధి చెందిన సింగరేణిలో వరుస ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆధునిక కాలంలో అంది వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో సింగరేణి తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. దేశ చరిత్రలోనే పారిశ్రామిక రంగంలో సింగరేణిది ప్రత్యేక స్థానం.

నాటి గ్రామీణ ప్రాంతా పాలేర్లు కార్మికులుగా అవతారమెత్తి చీకటి సూర్యులయ్యారు. సింగరేణి అంటే ఒక నిప్పురవ్వ ఉద్యమజాల.. ఇక్కడ కార్మిక సమస్యలు, పోరాటాలు ఎక్కువే. నష్టాల ఊబిలో కూరుకుపోయి లాభాల బాటలో ఉరకలేస్తున్న సింగరేణిలో ఎంతో మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం కార్మికుల కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తోంది. మెడికల్ ఇన్వలిడేషన్ పేరుతో నడుస్తున్న ఈ దందాలో ఎంతో మంది ఖద్దర్ చొక్కా నాయకులకు లక్షల రూపాయల లాభం చేకూరుతుంటే కొంత మంది కార్మికుల కుటుంబాల్లో మాత్రం చీకటి వెలుగులు నింపుతోంది.

సింగరేణి ప్రస్థానంలో ఎన్నడూ లేని విధంగా మెడికల్ అన్ ఫిట్ పేరుతో నడుస్తున్న ఈ వ్యవహారంలో ఎంతో మంది కార్మికులు నష్టపోతున్నా.. దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కానీ.. స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. సింగరేణి వ్యాప్తంగా పోగొట్టిన కారుణ్య నియామకాల ఉద్యోగాలను తీసుకువచ్చామని చెప్పుతున్నారే కానీ.. కారుణ్య నియామకాలలో జరిగిన అక్రమాలను మాత్రం బయటకు చెప్పడంలో కొంత మంది నాయకులు విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణి కారుణ్య నియామకాలలో ఒక్క రూపాయి లంచం అడిగిన చెప్పుతో కొట్టండి అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ.. అది మాత్రం సింగరేణిలో అమలు కావడం లేదు.

దేశానికి వెలుగునిచ్చే సింగరేణి కార్మికుల కుటుంబాలలో చీకటి పరిస్థితులు నెలకొంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి వ్యాపించి ఉన్న జిల్లాలో ఎంతో మంది కార్మికులు ఇప్పటికే కారుణ్య నియామకాల పేరుతో తమ కుమారులకు ఉద్యోగాలు రాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు స్థానిక యూనియన్ నాయకుల నుండి కానీ.. ప్రభుత్వం నుండి గానీ ఒక్క ప్రకటన కూడా విడుదల కాకపోవడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు సింగరేణిలో యాంత్రీకరణ పెరుగుతుండడంతో కార్మికుల సంఖ్య తగ్గిపోతూ ఉంటే ఉన్న కార్మికుల వారసులకు ఉద్యోగాలు రాకపోవడంతో సతమతమవుతున్నారు.

సింగరేణిలో మెడికల్ అన్ ఫిట్‌కు దరఖాస్తు పెట్టుకొని మెడికల్ ఇన్వలిడేషన్ కాకపోవడంతో ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది. రామగుండం డివిజన్-1 పరిధిలోని జీడీకే 11వ గనిలో కోల్ కట్టర్‌గా పనిచేస్తున్న పవర్ హౌస్ కాలనీకి చెందిన మల్కా సత్యనారాయణ అనే కార్మికుడిని మెడికల్ ఇన్వలిడేషన్‌లో ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అని చెప్పి పంపించడంతో ఇటు విధులు నిర్వహించలేక అటు ఆరోగ్యం సహకరించక మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఇలా మృతి చెందిన ఏ ఒక్క కార్మిక కుటుంబాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు కానీ.. ప్రభుత్వం కానీ.. నాయకులెవరూ పరామర్శించిన దాఖలాలు కనిపించడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..?

సింగరేణి వ్యాప్తంగా ప్రతీ కార్మికుడి వారసులకు ఉద్యోగాన్ని కల్పిస్తామని యూనియన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని పలువురు కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సింగరేణిలో మెడికల్ బోర్డుకు వెళ్ళిన ప్రతీ కార్మికుడు.. లక్షల రూపాయలను ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది. సింగరేణి యూనియన్ ఎన్నికల సమయంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి, తదితర ప్రాంతాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఎంతో మంది ప్రజా ప్రతినిధులు పాల్గొని కార్మికులకు ఎన్నో హామీలు గుప్పించారు.

కానీ, ఇప్పటివరకు అవి అమలు కాకపోవడం పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మెడికల్ బోర్డు పేరుతో ఎంతో మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా కనీసం స్పందించని ప్రభుత్వం తీరుపై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి తమకు మెడికల్ బోర్డుకు అవకాశం ఇవ్వాలని నష్టపోయిన కార్మికులను మరోసారి మెడికల్ బోర్డుకు అనుమతించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా మెడికల్ బోర్డులో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం, నాయకులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.

Next Story