‘అన్నదాతల’ నిలువు దోపిడీ.. తాలు, తేమ పేరుతో 1కేజీకి..!

by  |
‘అన్నదాతల’ నిలువు దోపిడీ.. తాలు, తేమ పేరుతో 1కేజీకి..!
X

దిశ, కరీంనగర్ సిటీ : కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ గోల్‌మాల్ గోవిందం అన్నట్టుగా సాగుతున్నాయి. ఉన్నతాధికారులు చెప్పేదొకటి, క్షేత్ర స్థాయిలో జరుగుతున్నదొకటి. ఇటు కేంద్రాల నిర్వాహకులు, అటు మిల్లర్లు ఇష్టారాజ్యంగా కోతలు పెడుతూ, తరుగు, తాలు, తేమ పేర ఎవరికీ వారే అందినకాడికి దోచుకుంటున్నారు. దీంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. అసలే ఆలస్యంగా చేపట్టిన ధాన్యం సేకరణలో మిల్లర్లు, కేంద్రాల నిర్వాహకులు కుమ్ముక్కై మాయాజాలం చేస్తుండగా, కింది స్థాయి అధికారులు చోద్యం చూస్తు్న్నట్టు తెలుస్తోంది.

నిబంధనల మేరకు ప్రతీ 40 కిలోలకు కేవలం 900 గ్రాముల ధాన్యం మాత్రమే కోత విధించాల్సి ఉంటుంది. అయితే, తరుగు, తాలు పేరిట కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు 3నుంచి 4 కిలోల కోత విధిస్తున్నట్టు సమాచారం. మిల్లర్ల వద్దకు చేరిన వడ్లను తేమ పేరిట క్వింటాల్‌కు మరో 5 కిలోల చొప్పున కోత పెడుతున్నారు. అప్పటికే కొనుగోలు కేంద్రాల్లో రూ.65 నుంచి రూ.70 వరకు నష్ట పోతుండగా, మిల్లర్ల వద్ద రూ.90 వరకు కత్తెర పడుతున్నది.

దీంతో ఒక్కో రైతు క్వింటాల్‌కు రూ.150 నుంచి రూ.160 నష్టపోతున్నాడు. జిల్లాలోని అన్ని ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఇదే తంతు కొనసాగుతుండగా.. అన్నదాతలు ఇప్పటికే లక్షలాది రూపాయలు నష్టపోయారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 5 శాతం మాత్రమే ధాన్యం సేకరించగా, ఇంకా 95 శాతం కూడా ఇదేతీరున జరిగితే రైతులు తీవ్రంగా నష్టపోయి, పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు కట్టుకోలేక రోడ్డున పడాల్సి రావచ్చు. వాస్తవంగా 17 శాతం తేమ వుండేంత వరకు ధాన్యం ఆరబోయాల్సి ఉంటుంది. అయితే, కొనుగోళ్లతో జరుగుతున్న జాప్యం మూలంగా ఆరబోసిన ధాన్యం అలాగే ఉంచి, పైకప్పులు రాత్రి వేళ కప్పి, ఉదయం తీస్తుంటారు.

దీంతో 12 నుంచి 13 శాతం వరకు తేమ తగ్గి మర ఆడిస్తే నూకలు అధికంగా వస్తుంటాయి. దీనిని సాకుగా చూపుతూ మిల్లర్లు క్వింటాల్ కు 5 కిలోల చొప్పున రైతులను ముక్కుపిండి మరీ ధాన్యం కొనుగోళ్లలో కోత పెడుతున్నారు. ఎదురు ప్రశ్నించిన రైతుల ధాన్యాన్ని తిప్పి పంపించేస్తున్నారు. దీంతో దళారులకు అమ్మలేక, రోజుల తరబడి కేంద్రాల్లో పడిగాపులు కాయలేక రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి కేంద్రాలు, మిల్లర్ల కొనుగోలు దోపిడీపై చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Next Story

Most Viewed