ఎంసీసీ కీలక నిర్ణయాలివే

by  |
ఎంసీసీ కీలక నిర్ణయాలివే
X

దిశ, స్పోర్ట్స్ : ప్రపంచ క్రికెట్‌‌కు దిశానిర్దేశం చేసేది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). అలాంటి పెద్దన్న కూడా మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) రూపొందించిన నిబంధనలే పాటిస్తుందనేది అందరికీ తెలిసిన విషయం. క్రికెట్ లా బుక్‌ను రూపొందించే ఎంసీసీ సర్వసభ్య సమావేశం ఇటీవల లండన్‌లో జరిగింది. మైక్ గాటింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కుమార సంగక్కర, షేన్ వార్న్ ప్రత్యక్షంగా, సౌరవ్ గంగూలీ ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. గత కొంత కాలంగా పేసర్లు విసిరే షార్ట్‌పిచ్ బంతులపై కీలక చర్చ జరుగుతున్నది. ఫాస్ట్ బౌలర్లు విసిరే బౌన్సర్ల కారణంగా బ్యాట్స్‌మన్ గాయపడుతున్నారని చాలా ఫిర్యాదులు అందాయి. ప్రస్తుతం ఓవర్‌కు ఒక బౌన్సర్ వేసే వెసులు బాటు ఉన్నది. ఆ ఒక్క బంతిని కూడా తీసేయాలని డిమాండ్లు వచ్చాయి. దీనిపై ఎంసీసీ ప్రతికూలంగా స్పందించింది. క్రికెట్ ఆటలో షార్ట్ పిచ్ బంతి చాలా కీలకమని చెప్పింది. ఆటలో ఇప్పటికే బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం పెరిగిపోయింది. షార్ట్ పిచ్ బంతులు లేకపోతే సమతుల్యత దెబ్బతింటుందని ఎంసీసీ అభిప్రాయపడింది. అయితే జూనియర్ క్రికెట్, టెయిలెండర్ల విషయంలో షార్ట్ పిచ్ బంతులపై ఈ ఏడాది డిసెంబర్ లోగా నిర్ణయం తీసుకుంటామని ఎంసీసీ స్పష్టం చేసింది.

సెంట్రలైజ్డ్ థర్డ్ అంపైర్లు..

ప్రస్తుతం అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగే సమయంలో ఫీల్డ్ అంపైర్లతో పాటు టీవీ అంపైర్లు (థర్డ్ అంపైర్) కూడా స్టేడియంలోనే ఉంటున్నారు. ఐసీసీ ప్యానల్‌లోని అంపైర్లే టీవీ అంపైర్లుగా ఉంటున్నారు. ప్రస్తుతం నిపుణులైన ఫీల్డ్ అంపైర్లు కొరతగా ఉన్న సమయంలో ప్రతీ మ్యాచ్‌కు ఒక టీవీ అంపైర్‌ను కేటాయించడం సరికాదని ఎంసీసీ భావిస్తున్నది. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, నేషనల్ ఫుట్‌బాల్ లీగ్‌లో టీవీ అంపైర్లు స్టేడియంలో ఉండరు. సెంట్రల్ పూల్‌లో కూర్చొని ఒకేసారి నాలుగైదు మ్యాచ్‌లు పర్యవేక్షిస్తూ ఉంటారు. అదే విధంగా ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా ఒక చోటనే థర్డ్ అంపైర్లు ఉండేలా నిబంధనలు మార్చాలని ఎంసీసీ నిర్ణయించింది. సెంట్రల్ పూల్‌లో ఉండే అంపైర్లు ఒకేసారి రెండు మూడు మ్యాచ్‌లు పర్యవేక్షిస్తుండటం వల్ల మరింత మంది ఆన్‌ఫీల్డ్ అంపైర్లు లభించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగినందు వల్ల ఈ నిర్ణయం అమలు చేయడం పెద్ద కష్టమేం కాదని ఎంసీసీ అభిప్రాయపడింది. ఇక కరోనా కారణంగా ఇద్దరు న్యూట్రల్ అంపైర్లు నియమించడం కష్టమైనందున మరి కొంత కాలం ఒక న్యూట్రల్ అంపైర్, మరొక స్వదేశీ అంపైర్‌ను నియమించుకునేలా తాత్కాలిక సవరణ చేశారు.

ఉమ్మిపై నిషేధం పొడిగింపు..

కరోనా కారణంగా ఎంసీసీ కొన్ని తాత్కాలిక నిబంధనలు అమలులోకి తెచ్చింది. అందులో ముఖ్యమైనది బౌలర్లు ఉమ్మిని వాడకుండా నిషేధించడం. కాగా, ఉమ్మిని వాడకపోవడం వల్ల బంతిని స్వింగ్ చేయలేకపోతున్నామని పలువురు బౌలర్లు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. దీనిని ఎంసీసీకి కూడా చేరవేయగా.. ఉమ్మిపై ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం తొందరపాటు అవుతుందని చెప్పింది. కరోనా మహమ్మారి ఇంకా తగ్గుముఖం పట్టనందువల్ల ఉమ్మిపై మరి కొంత కాలం నిషేధం పొడిగిస్తున్నట్లు చెప్పింది. మరోవైపు డీఆర్ఎస్ పద్దతిపై కూడా స్పష్టత తీసుకొని రావాలని ఎంసీసీ భావిస్తున్నది. ప్రస్తుతం హోస్ట్ బ్రాడ్‌కాస్టర్ ద్వారా మాత్రమే డీఆర్ఎస్ టెక్నాలజీ వినియోగం జరుగుతున్నది. దీని వల్ల ఒక్కో దేశంలో, ఒక్కో బ్రాడ్‌కాస్టర్ ఒక్కో పద్దతిని ఉపయోగిస్తున్నారు. కానీ ఇకపై ఐసీసీ అభివృద్ది చేసే డీఆర్ఎస్ పద్దతిని వాడాలని ఎంసీసీ నిర్ణయించింది. అన్ని మ్యాచ్‌లలో ఇదే డీఆర్ఎస్ వినియోగించాలని భావిస్తున్నది. దీంతో పాటు ఎల్బీడబ్ల్యూ నిర్ణయంలో ‘అంపైర్స్ కాల్’పైన కూలంకషంగా చర్చ జరిగింది. ఈ సమయంలో రివ్యూ రిటైన్ చేస్తున్నారు. కానీ దాన్ని కూడా ఒక రివ్యూ కింద పరిగణించే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు.

Next Story

Most Viewed