సాగర్ బీజేపీ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డి..?

by  |
సాగర్ బీజేపీ అభ్యర్థిగా ఎంసీ కోటిరెడ్డి..?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న ఎంసీ కోటిరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఉపఎన్నిక టికెట్ ఆశించి భంగపడ్డ ఎంసీ కోటిరెడ్డి.. నేడు హైదరాబాద్‌లో బీజేపీలో చేరనున్నట్టు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కొంతకాలంగా కోటి రెడ్డి టచ్‌లో ఉంటూ వస్తున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ ఉపఎన్నిక అభ్యర్థిని ఖరారు చేయకుండా నాన్చుతూ రావడం.. తీవ్ర పోటీ నెలకొనడం వంటి కారణాలతో బీజేపీలోకి చేరేందుకు కోటిరెడ్డి ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం కోటిరెడ్డి హైదరాబాద్‌లో బీజేపీ ముఖ్యనాయకులతో కలిసి ప్రత్యక్ష్యం కావడం టీఆర్ఎస్‌లో దుమారం రేపుతోంది.

మంగళవారం నామినేషన్…

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో నామినేషన్ వేసేందుకు మంగళవారం ఒక్కరోజు మాత్రమే గడువు ఉంది. అయినా టీఆర్ఎస్ అధిష్టానం ఇంతవరకు అభ్యర్థి పేరును ప్రకటించలేదు. దీంతో వ్యుహాత్మకంగా కేసీఆర్ పావులు కదుపుతున్నాడని.. ఎంతమాత్రం ఆలస్యం చేసినా.. అటుఇటు కాకుండా మిగిలిపోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో కోటిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బీజేపీలో సోమవారం బండి సంజయ్ సమక్షంలో హైదరాబాద్ కార్యాలయంలో చేరనున్నారు. అనంతరం 2 గంటలకు బీజేపీ సాగర్ అభ్యర్థిగా కోటిరెడ్డి పేరును అధికారికంగా బీజేపీ ప్రకటించనుంది. మంగళవారం ఉదయం 11 గంటల తర్వాత ఎంసీ కోటిరెడ్డి బీజేపీ తరపున నామినేషన్ వేయనున్నారు.

9 గంటలకు ప్రగతి భవన్‌కు..

ఉపఎన్నిక టికెట్‌పై కేసీఆర్ స్పష్టతనివ్వకపోవడం.. అభ్యర్థిత్వం ఖరారయ్యే సూచనలు పెద్దగా లేకపోవడంతో ఎంసీ కోటిరెడ్డి పూర్తిగా బీజేపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారు. ఆదివారం రాత్రి నుంచి హైదరాబాద్‌లో కోటిరెడ్డి మకాం వేయడం.. ఇప్పటికే పలుమార్లు బీజేపీ ముఖ్యనేతలు కోటిరెడ్డితో సుదీర్ఘ మంతనాలు జరపడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఖంగుతిన్న టీఆర్ఎస్ శ్రేణులు కోటిరెడ్డి బీజేపీలోకి చేరే విషయాన్ని అధిష్టానం ద‌ృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రగతిభవన్ నుంచి ఎంసీ కోటిరెడ్డికి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. ఉదయం 9 గంటలకు సీఎం కేసీఆర్.. ఎంసీ కోటిరెడ్డితో భేటీకానున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేశారని, కోటిరెడ్డికి మరేదైనా ఆఫర్ ఇస్తారా.. ఆయన్నుఎలా బుజ్జగిస్తారనేది చూడాలి. కేసీఆర్ బుజ్జగింపులకు కోటిరెడ్డి వెనక్కి తగ్గుతారా లేదా అన్నది ప్రశ్నార్థకమే. అయితే వాస్తవానికి గతంలోనే కోటిరెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. అయినా నర్సింహాయ్య ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా వీలుచిక్కినప్పుడల్లా తన ధిక్కార స్వరాన్ని విన్పిస్తూనే వచ్చారు. ఉపఎన్నిక ప్రస్తావన వచ్చినప్పటి నుంచి నాన్ లోకల్, లోకల్ ఇష్యూను తెరపైకి తేచ్చారు. అయినా టికెట్ దక్కకపోవడంతో నిరాశ చెంది పార్టీ వీడుతున్నారని సన్నిహితులు తెలిపారు.

Next Story