నిబంధనలు ఉల్లంఘించినందుకు మాస్టర్‌కార్డ్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు

by  |
నిబంధనలు ఉల్లంఘించినందుకు మాస్టర్‌కార్డ్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ మాస్టర్‌కార్డుపై దేశీయ సెంట్రల్ బ్యాంక్ ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. డేటా స్టోరేజీకి సంబంధించిన నిబంధనలను పాటించని కారణంగా దేశీయంగా కొత్త వినియోగదారులకు కార్డులను జారీ చేయకుండా ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 22వ తేదీ నుంచి దేశీయంగా కొత్త వినియోగదారులకు డెబిట్​, క్రెడిట్​ కార్డ్​లను జారీ చేయడాన్ని నిషేధిస్తూ, ప్రీపెయిడ్ నెట్‌వర్క్‌లోకి చేర్చుకోకూడదని వెల్లడించింది. ప్రస్తుతం మాస్టర్ కార్డ్ వాడుతున్న వారిపై ఎటువంటి ప్రభావం ఉండదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

చెల్లింపులకు సంబంధించి డేటాను నిల్వ చేయడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నిబంధనలను ఉల్లంఘించినందునే మాస్టర్‌కార్డ్‌పై చర్యలు తీసుకున్నామని ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. మాస్టర్‌కార్డ్‌కు తగిన సమయం, అవకాశం ఉన్నప్పటికీ ‘చెల్లింపుల డేటా నిల్వ’పై ఆదేశాలను బేఖాతరు చేసిందని ఆర్‌బీఐ వివరించింది. చెల్లింపుల డేటాను దేశీయంగానే భద్రపరచవల్సి ఉంటుందని 2018, ఏప్రిల్‌లో ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసింది. దీనికి 6 నెలల పాటు గడువును కూడా ఇవ్వగా, మాస్టర్‌కార్డ్ నిబంధనలను పాటించడంలో విఫలమైందని, అందుకుగానూ, పేమెంట్స్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం-2007 ప్రకారం చర్యలు తీసుకున్నట్టు ఆర్‌బీఐ పేర్కొంది. ఇదివరకు డైనర్స్ క్లబ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డు సంస్థలపై కూడా ఆర్‌బీఐ ఇదే తరహా ఆంక్షలను విధించింది. ఈ ఏడాది మే 1 నుంచి కొత్తగా దేశీయ వినియోగదారులకు క్రెడిట్ కార్డు జారీ చేయకుండా ఈ కంపెనీలను నిషేధించింది.

Next Story

Most Viewed