‘అప్పు తెచ్చి అభివృద్ధి చేశా.. బిల్లులివ్వండి’

by  |
‘అప్పు తెచ్చి అభివృద్ధి చేశా.. బిల్లులివ్వండి’
X

దిశ, చేవెళ్ల: ‘అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టాం. రూ.8లక్షలతో వైకుంఠధామం నిర్మించాం. ఆరు నెలలు అయినా బిల్లులు చెల్లించడం లేదు. కేవలం రూ.3.40లక్షల బిల్లు మాత్రమే వచ్చింది. గ్రామానికి మిషన్ భగీరథ పథకం కింద లక్ష లీటర్ల నీరు సరఫరా కావాల్సి ఉండగా కేవలం 20వేల లీటర్లు మాత్రమే సరఫరా అవుతోంది. సొంత డబ్బులతో జీపీ బోర్లకు మరమ్మతులు చేయించి నీరు సరఫరా చేయించా. బిల్లులు మాత్రం మంజూరు చేయడం లేదు. సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు’ అని మాసానిగూడ సర్పంచ్​ రాములు ఆవేదన వ్యక్తం చేశాడు.

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మాసానిగూడ గ్రామంలో 1500 మంది జనాభా ఉంటుంది. అధికారిక లెక్కల ప్రకారం లక్ష లీటర్ల వరకు మిషన్​భగీరథ నీరు సరఫరా జరగాల్సి ఉంది. అధికారులు మాత్రం నీరు పుష్కలంగా సరఫరా చేస్తున్నామని గొప్పలు చెబుతున్నప్పటికీ గ్రామపంచాయతీ బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు సర్పంచ్​చెబుతున్నారు. గ్రామపంచాయతీ బోర్లు పాడైతే రిపేర్ చేయిస్తే వాటికి సంబంధించిన బిల్లులు అధికారులు చేయడం లేదు. మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్నప్పుడు గ్రామపంచాయతీ బోర్లకు సంబంధించి బిల్లులు ఎలా చేస్తామంటూ అధికారులు ప్రశ్నిస్తున్నారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

అప్పులతో వైకుంఠ ధామం..

గ్రామంలో వైకుంఠధామం పనులు జరుగుతున్నాయి. రూ.12 లక్షల విలువగల నిర్మాణం పనులు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు రూ. 8 లక్షల విలువైన పనులు చేపట్టారు. ప్రైవేటుగా అప్పులు తెచ్చి మరీ వైకుంఠ ధామం నిర్మిస్తే కేవలం రూ.3.40 లక్షలు బిల్లు మాత్రమే వచ్చాయి. పనులు చేసి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు మిగతా డబ్బులు ప్రభుత్వం నుంచి రాలేదు. అధికారులకు ప్రభుత్వం నుంచి ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకోవాలని సమాధానం ఇస్తున్నారని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

అధ్వానంగా కచ్చిరెడ్డి గూడెం రోడ్డు..

వికారాబాద్ రోడ్లు భవనాల శాఖ రోడ్డు నుంచి కచ్చి రెడ్డిగూడెం గ్రామం వరకు రోడ్డు కంకర తేలిన అధ్వానంగా తయారైంది. మాసాని గూడ గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామమైన కచ్చిరెడ్డి గూడెం గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయడంలో గతంలో పనిచేసిన ప్రజాప్రతినిధులు ఘోరంగా విఫలమయ్యారు. మేడ్చల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి స్వగ్రామమైన మాసాని గూడకు అనుబంధ గ్రామం గా ఉంది. గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు ఎవరు ఆ గ్రామానికి రోడ్డు వేద్దామన్న ఆలోచన రాకపోవడం గమనార్హం.

బిల్లులు రావడం లేదు..

మసాని గూడ గ్రామానికి అనుబంధ గ్రామం కచ్చి రెడ్డి గూడ. గ్రామంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. మిషన్ భగీరథ పథకం కింద లక్ష లీటర్ల నీరు సరఫరా కావాల్సి ఉండగా కేవలం 20వేల లీటర్లు మాత్రమే సరఫరా అవుతోంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఒక్కోసారి బోర్లు చెడిపోయి సొంత డబ్బులు వెచ్చించి మరమ్మతు చేయిస్తే బిల్లులు చెల్లించమని అధికారులు చెబుతున్నారు. మిషన్ భగీరథ నీరు వదలరు బోర్లు బాగా చేస్తే బిల్లును ఇవ్వరు ఇదెక్కడి న్యాయం. ఆరు నెలలు గడుస్తున్నా అధికారులు రికార్డులు చేస్తలేరు.. అప్పులు తెచ్చి పనులు చేస్తే బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నాం. –రాములు, మాసానిగూడ సర్పంచ్

త్వరలో రికార్డు చేస్తా..

శంకర్​పల్లి మండలం మాసానిగూడ గ్రామంలో వైకుంఠధామం పనులకు సంబంధించి రికార్డులు త్వరలో చేస్తా. చేవెళ్ల, శంకర్​పల్లి రెండు మండలాలకు ఇన్​చార్జిగా విధులు నిర్వహిస్తున్నా. బిల్లులు చేయడంలో ఆలస్యం చేయడం లేదు. –ప్రశాంత్ రెడ్డి, పీఆర్ ఇన్​చార్జి ఏఈ

మిషన్ భగీరథ నీటి సరఫరాను పరిశీలిస్తా..

మాసానిగూడ గ్రామానికి మిషన్ భగీరథ నీటికి సంబంధించి పరిశీలిస్తాం. నీటి సరఫరాలో అవాంతరాలు ఏమైనా జరిగితే వెంటనే పరిశీలించి పూర్తిస్థాయిలో నీరు సరఫరా జరిగేటట్లు చర్యలు తీసుకుంటాం. –నరేందర్ ఆర్​డబ్ల్యూఎస్ ఏఈ

Next Story