ఎమ్మెల్యే ఇలాకాలో వలసలు.. కొంప ముంచిన టీఆర్ఎస్ సంస్థాగత కమిటీలు

by  |
ఎమ్మెల్యే ఇలాకాలో వలసలు.. కొంప ముంచిన టీఆర్ఎస్ సంస్థాగత కమిటీలు
X

దిశ, నల్లబెల్లి : నియోజకవర్గ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి సొంత మండలంలో కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయి. క్రమక్రమంగా అధికార పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు చకచక పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి కాస్త వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇదిలా ఉండగా.. ఇటీవల నల్లబెల్లి మండలంలో టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలు నిర్వహించి గ్రామ, మండల కమిటీలు వేశారు. రానున్న ఎన్నికల్లో ఈ కమిటీలే కీలకంగా వ్యవహరిస్తాయని సంకేతాలు సైతం అందించారు. సరిగ్గా ఇక్కడే ఈ కమిటీలో పదవులు ఆశించి భంగపడిన వారు హస్తం వైపు చూస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఏదేమైనా గడచిన వారం రోజుల నుండి మండలానికి చెందిన అధికార పార్టీ వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు హస్తం పార్టీలో దశల వారీగా చేరుతున్నారు.

పెరుగుతోన్న చేరికలు…

రెండు రోజుల కిందట నల్లబెల్లి మండలంలోని ఆసరవెళ్లి, రాంపూర్ గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, ఆసరవెళ్లి ఉప సర్పంచ్ గుండెబోయిన మంజుల సాంబయ్య, కొందరు వార్డు సభ్యులు సహా 60 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం బజ్జు తండా గ్రామ ఉప సర్పంచ్ నునావత్ ఖాసీం ఆధ్వర్యంలో ముప్పై కుటుంబాలు, గుండ్ల పహాడ్ గ్రామానికి చెందిన పలువురు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ నాయకుల దూకుడు…

నూతన టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డిని ఎంపిక చేసిన నాటి నుండి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు నూతన ఉత్సాహంతో కదం తొక్కుతున్నారు. ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ఎండగడుతున్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, గిరిజనుల రిజర్వేషన్ పెంపు, రైతులకి లక్ష రూపాయల రుణమాఫీ, నిరుద్యోగ భృతి, మొదలైన హామీలు నీటి మూటలవడంతో టీఆర్ఎస్ వైఖరిని వ్యతిరేకిస్తూ జనాల్లోకి వెళ్తున్నారు. సమావేశాలు పెడుతూ అధికార పార్టీ పోకడల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో కలిసి వస్తున్న టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను, నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తూ చాపకింద నీరులా పావులు కదుపుతూ మండలంలో కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నారు.


Next Story

Most Viewed