చల్లా వర్సెస్ బుర్ర.. భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్ష రేసులో ఉత్కంఠ

125

దిశ, భూపాలపల్లి:  భూపాలపల్లి జిల్లా తెరాస అధ్యక్ష పదవి కోసం పలువురు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా పదవి కోసం జిల్లాలోని పలువురు నాయకులు స్థానిక శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి, మంథాని నియోజకవర్గ తెరాస ఇన్చార్జి పుట్టమధు చుట్టూ  ప్రదక్షిణలు చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా తెరాస అధ్యక్ష పదవి కోసం పలువురు ప్రయత్నం చేస్తుండగా ఇక్కడ గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పిన మాటే వేదం అని, అతని విధేయులకి పట్టం కట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. గండ్ర వెంకటరమణారెడ్డి అనుకూలమైన వ్యక్తులకి అధ్యక్ష పదవి ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన చల్లా నారాయణ రెడ్డి తనదైన శైలిలో గండ్ర వెంకటరమణ రెడ్డి ఆమోదంతో అధ్యక్ష పదవి కైవసం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ధన్వాడ సర్పంచిగా, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ గా, కాటారం జెడ్పీటీసీగా, కరీంనగర్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేగాక మాజీ స్పీకర్ శ్రీపాదరావు అత్యంత సన్నిహితంగా ఉండటంతో పాటు అతని అనంతరం ప్రస్తుత శాసన సభ్యులు శ్రీధర్ బాబుతో సైతం 20 సంవత్సరాలు శ్రీధర్ బాబుతో ఉన్నారు. అనంతరం ఇరువురి మధ్య విభేదాలు రావడంతో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

ప్రస్తుతం కాటారం సింగిల్విండో చైర్మన్ గా పనిచేస్తూ టీఆర్ఎస్ పార్టీలో చురుకుగా పనిచేస్తున్నారు. గత సంవత్సర కాలంగా గండ్ర వెంకటరమణ రెడ్డి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కాగా గండ్ర వెంకటరమణ రెడ్డికి గత ముప్పై సంవత్సరాలుగా రాజకీయంగా అండగా ఉంటున్న బుర్ర రమేష్ గౌడ్ సైతం పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. గండ్రవెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో భూపాలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు.

గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు ఆయన సైతం టీఆర్ఎస్ తీర్థము తీసుకొని గండ్రకు అత్యంత సన్నిహితుడిగా వ్యవరిస్తున్నారు. మున్సిపల్  పార్టీ ఎన్నికల సమయంలో కౌన్సిలర్ గా పోటీ చేసి వైస్ చైర్మన్ పదవిని ఆశించిన బుర్ర రమేష్ గౌడ్ శాసనసభ్యులు పోటీ చేయవద్దని చెప్పడంతో విరమించుకున్నాడు. భవిష్యత్తులో మంచి పదవి ఇస్తానని హామీ ఇవ్వడంతో బుర్ర రమేష్ గౌడ్ శాసనసభ్యుని హామీతో, పదవి కోసం ఎదురు చూస్తున్నాడు. కాగ భూపాలపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తి ఆర్థికంగా ఉండాలని ఆలోచన సైతం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి అవసరమైన ఆర్థిక వనరులు ఉన్న వ్యక్తిని పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలనే ఆలోచనలో పార్టీ వర్గాలు ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంలో పార్టీ కాటారం సింగిల్విండో చైర్మన్ చల్లనారాయణ రెడ్డి వైపు ఎక్కువ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతుంది. అంతేగాక పార్టీ రాష్ట్ర నాయకత్వం సైతం చల్లనారాయణ రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన గండ్రసత్యనారాయణ రావుని ఎదిరించే వ్యక్తి కోసం సైతం పార్టీ వర్గాలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. పత్రికా పరంగా ప్రతి విమర్శలు చేయడం, కార్యకర్తలను చైతన్యవంతుల్ని చేసి వారికి అన్ని రకాల అండగా ఉండే వ్యక్తి కోసం సైతం పార్టీ ఆలోచన చేసినట్లు తెలిసింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..