రేవంత్‌ను క‌లిసిన మానుకోట గిరిజ‌న రైతులు.. ఎందుకంటే..?

by  |
రేవంత్‌ను క‌లిసిన మానుకోట గిరిజ‌న రైతులు.. ఎందుకంటే..?
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : ద‌శాబ్దాలుగా సాగుచేసుకుంటున్న గిరిజ‌నుల అసైన్డ్ భూముల‌ను అభివృద్ధి పేరిట ప్రభుత్వం లాక్కోవ‌డం దారుణ‌మ‌ని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. మ‌హ‌బూబాబాద్ మండ‌లంలోని సాంక్రియ తండా, బాబునాయ‌క్ తండాలోని 551స‌ర్వే నెంబ‌ర్లో గిరిజ‌నుల‌కు కేటాయించిన భూముల‌ను మెడిక‌ల్ కాలేజీ నిర్మాణానికి కేటాయించ‌డంపై మండిప‌డ్డారు. మ‌హ‌బూబాబాద్ మునిసిప‌ల్ 8వ వార్డు కౌన్సిల‌ర్ ర‌వినాయ‌క్ ఆధ్వర్యంలో ఆదివారం సాంక్రియా తండా, బాబునాయక్ తండాకు చెందిన ప‌లువురు గిరిజ‌న రైతులు, కాంగ్రెస్ నేత‌లు హైద‌రాబాద్‌లో రేవంత్‌రెడ్డిని క‌లిశారు. మా భూముల‌ను కాపాడంటూ వేడుకున్నారు. ఈ సంద‌ర్భంగా గిరిజ‌నుల‌కు 2007లో వైఎస్సార్ హ‌యాంలో అసైన్డ్ ప‌ట్టాలు అంద‌జేసిన ప‌త్రాల‌ను చూపారు. ఈ భూముల‌నే న‌మ్ముకుని బ‌తుకుతున్న త‌మ‌కు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేయాల‌ని చూస్తోంద‌ని రేవంత్ వ‌ద్ద ఆవేద‌న వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇదే 551 స‌ర్వే నెంబ‌ర్లోని దాదాపు 50ఎక‌రాలకు పైగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన గిరిజ‌న‌, గిరిజ‌నేత‌ర‌ ప్రజాప్రతినిధులు ఆక్రమించుకుని ప‌ట్టాలు పొందార‌ని రైతులు ఫిర్యాదు చేశార‌ని, భూముల‌ను ఆక్రమించుకుని ప‌ట్టాలు చేయించుకున్నా వారిపై ప్రభుత్వం…పేదోళ్లు సాగు చేసుకుంటున్న భూముల‌ను మాత్రం అభివృద్ధి పేరుతో లాక్కోవ‌డం దారుణ‌మ‌ని వాపోయిన‌ట్లు స‌మాచారం.

ఎవ్వర‌ని వ‌ద‌లం… అసెంబ్లీలో లేవ‌నెత్తుతాం..!
గిరిజ‌న రైతుల‌కు అన్యాయం చేయాల‌ని చూస్తే సంహించేది లేద‌ని రేవంత్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అసైన్డ్ రైతుల నుంచి అన్యాయంగా, ఎలాంటిప‌రిహారం చెల్లించ‌కుండా భూముల‌ను లాక్కోవ‌డంపై అసెంబ్లీ సాక్షిగా లేవ‌నెత్తుతామ‌ని రైతుల‌కు హామీ ఇచ్చారు. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో గౌరవ ఎమ్మెల్యే సీతక్క చే మాట్లాడిస్తాన‌ని చెప్పారు. సంక్రియ తండా, బాబు నాయక్ తండ రైతులకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై కూడా రేపు కోర్టులో దావా వేస్తామని పేర్కొన‌డం గ‌మ‌నార్హం. క‌బ్జాల‌కు పాల్పడిన వారిని వ‌దిలేద‌ని చెప్పారు.


Next Story